PM Modi : పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని టీఎంసీ ప్రభుత్వం ప్రజా ధనాన్ని కొల్లగొడుతోందని విమర్శించారు ప్రధాని మోదీ. ఆదివారం ఆయన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూచ్ బెహర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మహా జంగిల్ రాజ్ నడుస్తోందన్నారు. టీఎంసీ పాలనపై మోదీ మండిపడ్డారు.
‘‘పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వ పతనం ప్రారంభమైంది. అక్రమ చొరబాటుదారులకు మమత అండగా నిలుస్తోంది. మాల్దా, సందేష్కాలి ఘటనలు ఆమె ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. బెంగాల్లో మహా జంగిల్ రాజ్ (ఆటవిక రాజ్యం) నడుస్తోంది. ప్రజా ధనాన్ని టీఎంసీ కొల్లగొడుతోంది. కానీ, మే 4న ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత వారు దీనికి తగిన మూల్యం చెల్లించాల్సిందే. జనాభాలో మార్పుల కారణంగా ఒకవైపు మన నేలపైనే స్వేచ్ఛను కోల్పోతున్నాం. ఇంకోవైపు బీజేపీ ఉంది. సొంత నేలపై సగర్వంగా, తలెత్తుకుని నిలబడగల ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది. ఒకవైపు సిండికేట్ పాలనలో ఆస్తుల్ని కోల్పోతామనే భయం. ఇంకోవైపు తమ భూమిపై యాజమాన్య హక్కులు కల్పించగలదనే విశ్వాసం ఇవ్వగల పార్టీ’’ అంటూ బీజేపీ గురించి మోదీ చెప్పారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మోదీ తెలిపారు.
అక్రమ చొరబాటుదారుల్ని రక్షించేందుకే మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం ‘సర్’ను అడ్డుకుంటోందని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని, ఈ ఎన్నికలు పశ్చిమ బెంగాల్ భవిష్యత్‌ను నిర్ణయిస్తారన్నారు. ఎన్నికల రోజు టీఎంసీకి భయపడవద్దని మోదీ ప్రజలను కోరారు. ఈ ఎన్నికలు బెంగాల్ ప్రజల్లోని భయాన్ని బయటకు తొలగిస్తాయని అభిప్రాయపడ్డారు. ఇటీవల జడ్జీలు, పౌరులు ఎలా ఇబ్బంది పడ్డారో ప్రజలు చూశారని మోదీ అన్నారు. బెంగాల్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఏప్రిల్ 23, 29 తేదీల్లో ఈ ఎన్నికలు జరుగుతాయి.