(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ ‘పేరు గొప్ప .. ఫలితం దిబ్బ’ అన్న చందంగా మారాయి. ఈ జాబితాలో ‘మేకిన్ ఇండియా’ స్కీమ్ కూడా చేరింది. గురువారంనాటికి ఈ పథకం ప్రారంభించి 11 ఏండ్లయింది. అయితే, దీని ఫలాలు ఇప్పటికీ దక్కలేదని పారిశ్రామికవేత్తలు చెప్తున్నారు. దేశీయ కంపెనీలను, ఉత్పత్తులను ప్రోత్సహించడానికి తెచ్చిన ఈ పథకం లక్ష్యాన్ని చేరకపోగా.. ఉన్న పరిశ్రమలకూ తాళాలు వేసే పరిస్థితి నెలకొన్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గడిచిన 11 ఏండ్లలో 7 లక్షల కంపెనీలు మూతబడటమే దీనికి రుజువు అంటూ గణాంకాలను ఉదహరిస్తున్నారు. మొత్తంగా బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మేకిన్ ఇండియా స్కీమ్.. జోకిన్ ఇండియాగా మారినట్టు ధ్వజమెత్తుతున్నారు.
ఆరంభశూరత్వంలో ప్రధాని నరేంద్రమోదీ అగ్రగణ్యులు. 2014లో అధికారంలోకి వచ్చింది మొదలు.. కుప్పలుతెప్పలుగా ఆర్భాటపు ప్రకటనలు, స్కీమ్‌లను ప్రవేశపెట్టారు. అయితే, ఇందులో ఏ ఒక్కటీ విజయం సాధించిన దాఖలాలు లేవు. ఉదాహరణకు.. 2014, సెప్టెంబర్ 25న ‘మేకిన్ ఇండియా’ పేరిట బీజేపీ సర్కారు పెద్దయెత్తున ప్రచారానికి తెరతీసింది. తయారీరంగంలో ఏటా 12-14 శాతం వృద్ధిరేటు నమోదు, 2022 నాటికి జీడీపీలో తయారీ రంగం వాటాను 25 శాతానికి పెంచడం, 2022 నాటికి తయారీ రంగంలో 10 కోట్ల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ‘మేకిన్ ఇండియా’ స్కీమ్‌ను కేంద్రం ఆర్భాటంగా తీసుకొచ్చింది. అయితే, క్షేత్రస్థాయిలో ఇవేమీ జరుగలేదు.
2013-14 నుంచి ఇప్పటివరకూ తయారీరంగంలో వృద్ధిరేటు 5.9 శాతం కూడా దాటలేదు. జీడీపీలో తయారీ రంగం వాటా 16.4 శాతానికే పరిమితమైంది. తయారీ రంగంలో ఉద్యోగాలు 2011-12లో 12.6 శాతంగా ఉంటే, ప్రస్తుతం 10% కంటే తక్కువకు పడిపోయాయి. ముఖ్యంగా 2016-21 మధ్య ఉద్యోగాలు సగానికి తగ్గిపోయాయి. ఈ గణాంకాలను విశ్లేషిస్తే, మేకిన్ ఇండియా అట్టర్ ఫ్లాప్ అయినట్టు అర్థమవుతున్నది.
ప్రభుత్వ ప్రోత్సాహకాలు లేకపోవడంతో గడిచిన 11 ఏండ్లలో సుమారు 7 లక్షల కంపెనీలకు తాళంపడినట్టు నివేదికలు చెప్తున్నాయి. దీంతో లక్షలాది మంది కార్మికులు, చిరుద్యోగులు రోడ్డున పడే దుస్థితి వాటిల్లినట్టు పారిశ్రామికవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశంలో ఇప్పటికిప్పుడు అర్హతకు తగిన ఉద్యోగం కావాల్సినవారు 22 కోట్లమంది ఉన్నట్టు స్వచ్ఛంద సంస్థల నివేదికలు తేల్చి చెప్పాయి.
‘అచ్చేదిన్’ తీసుకొస్తామంటూ పదకొండేండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. తన అనాలోచిత నిర్ణయాలతో అన్ని రంగాలనూ అస్తవ్యస్తం చేసింది. రూపాయి పతనం చారిత్రాత్మక కనిష్ఠ స్థాయికి చేరుకోగా, ఇప్పుడు ఎగుమతుల్లోనూ దేశం అట్టడుగునకు దిగజారింది. స్వాతంత్య్ర కాలం నాటికి అంతర్జాతీయ ఎగుమతుల్లో దేశీయ వాటా 2.2 శాతంగా ఉండగా, ప్రస్తుతం అంతకన్నా తక్కువ 1.6 శాతం నమోదైంది. ఏడున్నర దశాబ్దాల కిందటితో పోల్చిచూస్తే దేశీయ ఎగుమతులు ప్రస్తుతం దారుణంగా పతనమవ్వడం పారిశ్రామికవర్గాలను కలవరానికి గురి చేస్తున్నది.
ఎగుమతులు ఎక్కువగా ఉన్న దేశం ఆర్థికంగా పుష్టిగా ఉంటుందని ఆర్థిక నిపుణులు చెప్తారు. ఎగుమతుల విలువ పెరిగితే.. అంతర్జాతీయంగా ఆ దేశానికి పరపతి పెరుగుతుంది. దౌత్య సంబంధాలు బలపడటంతో పాటు విదేశీ కరెన్సీ నిల్వలు పెరుగుతాయి. దేశీయంగా కంపెనీల సంఖ్య పెరిగి ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయి. అయితే, ప్రధాని మోదీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి అంతర్జాతీయంగా వివిధ అంశాల్లో దేశ పరపతి పడిపోతూనే ఉన్నది.
కేంద్రంలోని బీజేపీ సర్కారు అనాలోచిత నిర్ణయాలతో తాజాగా దేశీయ ఎగుమతుల విలువ చరిత్రలో చూడనటు వంటి స్థాయికి దిగజారింది. మేకిన్ ఇండియా స్కీమ్‌లో భాగంగా స్వదేశీ కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇవ్వకపోవడంతోనే ఎగుమతుల్లో క్షీణత నమోదైనట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
టారిఫ్‌లు, విదేశీ వలసలపై కఠిన ఆంక్షలు, హెచ్-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకొన్న నిర్ణయాలతో మోదీ దౌత్యంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దౌత్యంలో మోదీ ప్రభుత్వం విఫలమయ్యిందంటూ ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దీంతో నష్టనివారణ చర్యలకు దిగిన ప్రధాని మోదీ.. హఠాత్తుగా ‘స్వదేశీ’ నినాదాన్ని ఎత్తుకొన్నారు.
దేశీయ కంపెనీలను కాపాడుకోవాలని ప్రకటించారు. అయితే, 11 ఏండ్ల కిందట ప్రారంభించిన ‘మేకిన్ ఇండియా’ను ఇప్పటివరకూ ఎందుకు గాలికొదిలేశారని పలువురు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగ కల్పన, ఉత్పాదకత, కంపెనీలకు ప్రోత్సాహకాల్లో బీజేపీ ప్రభుత్వం విఫలమయ్యిందని మండిపడుతున్నారు. కాగా కార్మిక శక్తి ఎక్కువగా ఉన్న రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించకపోతే, నిరుద్యోగం మరింతగా పెచ్చరిల్లే ప్రమాదం ఉన్నదని నిపుణులు చెప్తున్నారు. అదే జరిగితే, దేశ ఆర్థిక వ్యవస్థే అల్లకల్లోలమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
నేత వస్త్రాలకు సంబంధించి బంగ్లాదేశ్, వియత్నాం వంటి చిన్న దేశాలు ఎగుమతుల్లో ఏటా 6 శాతానికి పైగా వృద్ధి నమోదు చేస్తుంటే, మన దగ్గర వృద్ధిరేటు ఒక్క శాతం కూడా ఉండట్లేదు. వస్త్ర పరిశ్రమకు కేంద్రం ఆశించిన స్థాయిలో ప్రోత్సాహకాలు ఇవ్వట్లేదని వ్యాపారులు చెప్తున్నారు. చేనేతపై తాజాగా జీఎస్టీ విధింపుతో ఈ పరిశ్రమ మరింత కుదేలయ్యే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాదరక్షల రంగంలో ప్రపంచ వాణిజ్య విస్తరణ 5 శాతం దాకా ఉన్నది. అయితే, భారత్‌లో ఇది ఒక్క శాతం కూడా మించట్లేదు. ఇక, ప్రభుత్వ పాలసీల కారణంగా 2014-2022 వరకూ 3,552 విదేశీ కంపెనీలు భారత్‌కు గుడ్‌బై చెప్పినట్టు సమాచారం.