Worli Hit And Run Case : మహారాష్ట్ర రాజధాని ముంబైలో శివసేన (Shiv Sena) నేత రాజేష్ షా (Rajesh Shah) కుమారుడు మిహిర్ మద్యం మత్తులో కారు నడిపి ఓ వివాహిత మరణానికి కారణమైన ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. వర్లి హిట్ అండ్ రన్ కేసులో ప్రధాన నిందితుడు మిహిర్ షాను ముంబై కోర్టు జులై 16 వరకూ పోలీస్ కస్టడీకి తరలించింది. మిహిర్ షాను మంగళవారం విరార్‌లో అరెస్ట్ చేసిన పోలీసులు బుధవారం ముంబైలోని సేవ్రి కోర్టు ఎదుట హాజరుపరిచారు.
జులై 7న వర్లి హిట్ అండ్ రన్ ఘటన అనంతరం మిహిర్ పరారీలో ఉన్నాడు. మిహిర్‌ను పట్టుకునేందుకు ముంబై పోలీసులు 14 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిహిర్ తండ్రి రాజేష్ షా, రాజ్‌రిషి సింగ్ బిదవత్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషాద సంఘటన తరువాత, మరణించిన మహిళ భర్త ప్రదీప్ నఖ్వా నిందితుడి అరెస్టులో జరిగిన జాప్యాన్ని ప్రశ్నించారు.
నిందితుడు తన భార్యను సీజే హౌస్ నుండి సీ లింక్ రోడ్ వరకూ ఈడ్చుకెళ్లాడని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసేవరకూ నిందితుడిని అరెస్ట్ చేయలేదని, రాజకీయ కారణాలతోనే పాలుకులు ఇలా వ్యవహరించారని దుయ్యబట్టారు. నిందితుడు రాజకీయ నేత కుమారుడు కావడం వలనే అరెస్ట్‌లో జాప్యం చేశారని మండిపడ్డారు. కాగా, ముంబైలోని వర్లీ ప్రాంతంలో ఇటీవల మిహిర్ ( Mihir Shah) మద్యం మత్తులో బీఎండబ్ల్యూ కారును వేగంగా నడుపుతూ ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టాడు. దీంతో స్కూటీపై వెళ్తున్న దంపతులు ఎగిరి రోడ్డుపై పడ్డారు.
అలాగే వేగంగా వెళ్తున్న కారు కావేరి నక్వా (45) పై నుంచి దూసుకెళ్లడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమె భర్త మాత్రం గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదం తర్వాత మిహిర్ ఫోన్లో తన తండ్రికి విషయం చెప్పడంతో ఆయన వెంటనే ఘటనా స్థలికి చేరుకొని కొడుకుని అక్కడ నుంచి పంపించి వేశాడు. ఇంతలో అక్కడకు చేరుకున్న పోలీసులు రాజేష్, డ్రైవర్ బిదావత్‌ను అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మిహిర్ తొలుత మహిళను ఢీకొన్న తర్వాత ఆమెను 1.5 కిలోమీటర్లు ఈడ్చుకు వెళ్లాడు .తర్వాత వాహనం టైరులో చిక్కుకున్న ఆమెను రోడ్డుపై పడేశాడు.
Read More :
Bengaluru Metro | బెంగళూరు మెట్రోలో ఘర్షణ.. బాక్సింగ్ తరహాలో కొట్టుకున్న ప్రయాణికులు.. వీడియో