Vinesh Phogat : భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపధ్యంలో ఆమె మామ మహవీర్ ఫోగట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2028 ఒలింపిక్స్‌లో ఆమె గోల్డ్ మెడల్ సాధించాలని తాను కోరుకున్నానని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో చేరి ఎన్నికల్లో పోటీ చేయాలన్న వినేశ్ నిర్ణయం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహవీర్ మాట్లాడుతూ పలు ఒలింపిక్స్‌లో వినేశ్ పాల్గొని దేశాలకు పతకాలు తీసుకురావాలని తాను కోరుకున్నానని, ఆమె తన ఒలింపిక్ లక్ష్యాన్ని సాధించడంపై దృష్టి సారించాల్సి ఉందని వ్యాఖ్యానించారు.
ఆమె రాజకీయాల్లో చేరడాన్ని తాను వ్యతిరేకిస్తానని చెప్పారు. అక్టోబర్ 5న జరగనున్న హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో వినేశ్ ఫోగట్ జులానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలో నిలవనున్నారు. కాగా మహవీర్ ఫోగట్ కూతురు బబితా ఫోగట్ 2019లో బీజేపీలో చేరింది. పిల్లలు ఓ వయసు వచ్చాక తమ నిర్ణయాలు తామే తీసుకుంటారు..ఇది వారి ఆలోచనపై ఆధారపడి ఉంటుంది..వారిని సరైన దిశలో ఎదిగేలా చేయడం తన బాధ్యతని మహవీర్ ఫోగట్ చెప్పుకొచ్చారు.
వినేశ్ ఈ వయసులో మరిన్ని ఒలింపిక్స్‌లో పాల్గొని దేశానికి మెడల్స్ తీసుకురావడంపై దృష్టి పెట్టడం సరైనదనేది తన అభిప్రాయమని పేర్కొన్నారు. కాగా, పారిస్ ఒలింపిక్స్‌లో వినేశ్ ఫోగట్ తన ఫైనల్ మ్యాచ్‌కు ముందు 100 గ్రాముల బరువు అధికంగా ఉండటంతో అనర్హత వేటుకు గురైన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆమె కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్‌ను(CAS) ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. ఈ వివాదం నేపధ్యంలో ఆమె రెజ్లింగ్ నుంచి రిటైరయ్యారు.
Read More :
Bajrang Punia | కాంగ్రెస్‌లో చేరిన రోజుల వ్యవధిలోనే.. బజరంగ్ పునియాకు బెదిరింపులు