Maharastra CM : మహారాష్ట్ర (Maharashtra) లోని ఇంద్రాయణి నది (Indrayani river) మీదున్న వంతెన (Bridge) కూలిపోయిన ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) స్పందించారు. ఆ వంతెన ప్రమాదకరమని కలెక్టర్ ముందే హెచ్చరించారని తెలిపారు. ఆ హెచ్చరికల తీవ్రత తెలియక పర్యాటకులు వంతెనపైకి వెళ్లి ఉంటారని అన్నారు.
సోమవారం ముంబైలో జరిగిన విలేకరుల సమావేశంలో ఫడ్నవీస్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఘటన జరగకముందే ఆ వంతెన ప్రమాదకరమని కలెక్టర్ ప్రకటించారు. అక్కడ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. కానీ ఆ హెచ్చరికల తీవ్రత తెలియక అధిక సంఖ్యలో పర్యాటకులు వంతెన పైకి వెళ్లారు. తుప్పుపట్టిన వంతెన బరువు ఆపలేక కూలిపోయింది.’ అని తెలిపారు.
అయితే అక్కడ కొత్త బ్రిడ్జి నిర్మాణం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది ఫడ్నవీస్ చెప్పారు. ఆ దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలని ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.
కాగా పుణె జిల్లాలోని కుందమాలా పర్యాటక ప్రాంతానికి ఆదివారం పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చారు. అక్కడ ఇంద్రాయణి నదిపై ఉన్న ఇనుప వంతెనపై అనేక మంది వచ్చి నిలబడిన క్రమంలోనే కొంతభాగం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో అనేక మంది పర్యాటకులు గల్లంతయ్యారు. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.