Maharashtra | మహారాష్ట్ర (Maharashtra) రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మంత్రివర్గంలోని కీలక నేత తన పదవికి రాజీనామా చేశారు. పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న ధనంజయ్ ముండే (Dhananjay Munde) రిజైన్ చేశారు. సర్పంచ్ హత్య కేసులో ఆయనపై ఆరోపణలు రావడంతో సీఎం ఫడ్నవీస్ సూచనల మేరకు ధనంజయ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఆయన రాజీనామాను తాను ఆమోదించినట్లు సీఎం తెలిపారు. అనంతరం ఆ రాజీనామా పత్రాన్ని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు పంపినట్లు మీడియాకు తెలిపారు.
కాగా, బీడ్ (Beed) సర్సంచ్ సంతోష్ దేశ్‌ముఖ్‌ను డిసెంబర్ 9న కొందరు దుండగులు కిడ్నాప్ చేసి హత్య చేశారు. ఈ హత్య స్థానిక రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఈ హత్య కేసులో మంత్రి ధనంజయ్ ముండే సహాయకుడు వాల్మిక్ కరాడ్ పాత్ర ఉందని ఆరోపణలు వచ్చాయి. దీంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బీడ్ జిల్లా పోలీస్ స్టేషన్లో ఉన్న నిందితుడిని మంత్రికి అత్యంత సన్నిహితుడైన బాలాజీ తండాలే కలవడం చర్చకు దారితీసింది. ఈ ఘటన రాజకీయంగానూ వేడి పుట్టించింది. ఈ క్రమంలో ధనంజయ్‌పై ప్రతిపక్షాలతో పాటు పలువురు మహాయుతి నేతలు సైతం విమర్శలు చేస్తున్నారు. దర్యాప్తు అధికారులు, స్థానిక రాజకీయ నేతలు కుమ్మక్కయ్యారని ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) నేతలు ఆరోపిస్తున్నారు. దర్యాప్తులో పారద్శకత కొరవడిందని, మంత్రి ముండే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం ఫడ్నవీస్ మంత్రి ధనంజయ్‌ను రాజీనామా చేయమని కోరినట్లు తెలుస్తోంది. సీఎం సూచన మేరకు ధనంజయ్ మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం.
Also Read..
Arvind Kejriwal | విపశ్యన ధ్యానం కోర్సుకు వెళ్లనున్న కేజ్రీవాల్.. పదిరోజుల పాటూ అక్కడే..!
MK Stalin | ఉత్తరాదిలో మూడో భాష ఏది..? కేంద్రానికి తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రశ్న
Viral Video | డ్రైవర్ వేధింపులు.. చెప్పుతో కొట్టిన మాజీ సీఎం కుమార్తె