Arvind Kejriwal | ఇటీవలే జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ప్రస్తుతం పార్టీ కార్యకలాపాలకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ‘విపశ్యన ధ్యానం కోర్సు’కు (Vipassana Course) వెళ్లనున్నట్లు తెలిసింది. పది రోజుల పాటూ ఈ ధ్యాన కార్యక్రమంలో పాల్గొననున్నట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి.
ఇందుకోసం ఆయన పంజాబ్ (Punjab)లోని హోషియార్‌పుర్ (Hoshiarpur) వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మార్చి 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ ఆయన ధ్యాన కేంద్రంలోనే ఉండనున్నట్లు తెలిసింది. కాగా, గతంలోనూ కేజ్రీ పది రోజులపాటూ విపశ్యన ధ్యానం చేసిన విషయం తెలిసిందే. 2023 డిసెంబర్లో హోషియార్పుర్లోని ధ్యాన కేంద్రంలోనే ఉన్నారు. ఇప్పుడు మరోసారి ఆయన అక్కడికి వెళ్లనున్నారు.
విపశ్యన మెడిటేషన్ అనేది పురాతన భారతీయ ధ్యాన పద్ధతి. ఇందులో అభ్యాసకులు వారి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోడానికి కోర్సు పూర్తయ్యేవరకు పదిరోజుల పాటు ఎవరితో మాట్లాడకుండా ఉంటారు. అలాగే అభ్యాసన కేంద్రం నుంచి బయటకు రావడం అనేది ఉండదు. బయటివ్యక్తులకు ఇందులో ప్రవేశం ఉండదు. కాగా, కేజ్రీవాల్ చాలా కాలంగా విపశ్యన ధ్యాన సాధన చేస్తున్నారు. గతంలో బెంగళూరు, జైపూర్తోసహా అనేక ప్రాంతాల్లో ఆయన ధ్యానం సాధన చేశారు.
Also Read..
Viral Video | డ్రైవర్ వేధింపులు.. చెప్పుతో కొట్టిన మాజీ సీఎం కుమార్తె
Supreme Court | ఆన్లైన్ కంటెంట్‌ను క్రమబద్ధీకరించాలి.. కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన