Maharashtra | ముంబయి : మరాఠా కోటా ఉద్యమంతో మహారాష్ట్ర రగులుతున్నది. విద్య, ఉద్యోగాల్లో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆందోళనకారులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నారు. జాతీయ రహదారులు, రైల్వే ట్రాకులను దిగ్బంధించారు. పలు చోట్ల ప్రభుత్వ, బీజేపీ కార్యాలయాలకు నిప్పుపెట్టారు. పుణే, శివగావ్, అహ్మద్‌నగర్ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలు మూతబడ్డాయి. పుణే-బెంగళూరు రహదారిపై ఆందోళనకారులు టైర్లకు నిప్పుపెట్టారు. బీజేపీ-శివసేన సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముంబై-బెంగళూరు హైవేను రెండు గంటలపాటు దిగ్బంధించటంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
రిజర్వేషన్ల అంశంపై ప్రత్యేక చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ వివిధ రాజకీయ పార్టీలకు చెందిన మరాఠా ఎమ్మెల్యేలు మంత్రాలయలోని నారిమన్ పాయింట్ వద్ద ఆందోళన చేపట్టారు. షోలాపూర్‌లో సామాజిక కార్యకర్తలు రైలు పట్టాలను దిగ్బంధించారు. జల్నా జిల్లా ఘన్సావంగి వద్ద కొందరు వ్యక్తులు పంచాయతీ సమితి కార్యాలయానికి నిప్పుపెట్టారు. హింగోలి జిల్లాలో బీజేపీ కార్యాలయాన్ని ఆందోళనకారులు తగులబెట్టారు.
మరాఠ్వాడా ప్రాంతంలోని మరాఠాలకు కుంబీ కుల సర్టిఫికెట్స్ జారీ చేయాలంటూ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి సందీప్ షిండే కమిటీ ఇచ్చిన నివేదికకు మహారాష్ట్ర సర్కార్ మంగళవారం ఆమోదం తెలిపింది. కుంబీ కుల సర్టిఫికెట్స్ జారీ ప్రారంభిస్తామని అధికారికంగా ప్రకటించింది. రిజర్వేషన్లపై గతంలో తీసుకొచ్చిన చట్టాన్ని సుప్రీంకోర్టు 2021లో కొట్టేసింది. దాంతో మరాఠా కమ్యూనిటీ ప్రజలకు ప్రభుత్వం కుంబీ సర్టిఫికెట్లు ఇవ్వాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనపై సామాజిక కార్యకర్త మనోజ్ జరాంగే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన జల్నాలో విలేకరులతో మాట్లాడుతూ, ‘ఇది అసంపూర్ణమైన రిజర్వేషన్. దీనిని ఎంతమాత్రమూ ఒప్పుకోం. రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి చట్టాన్ని చేయాలి’ అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరాఠాలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నారని, రాష్ట్రమంతటా వర్తించేలా రిజర్వేషన్లు ప్రకటించాలని జరాంగే అన్నారు. మరాఠాలోని కొన్ని వర్గాలకు మాత్రమే వర్తించేలా రిజర్వేషన్లు కల్పించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రిజర్వేషన్ల కోసం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష, గ్రామాల్లోకి రాకుండా రాజకీయ నాయకులను అడ్డుకోవటం కొనసాగిస్తాం’ అని ప్రకటించారు.