ముంబై : మసీదుల్లో లౌడ్స్పీకర్లను తొలగించాలని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) హెచ్చరికల నేపధ్యంలో మహారాష్ట్ర హోంమంత్రి దిలీప్ వల్సె పాటిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. లౌడ్స్పీకర్ల వాడకంపై కేంద్ర ప్రభుత్వం ఓ విధానాన్నితీసుకురావాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
లౌడ్స్పీకర్లపై వివాదం నెలకొన్న క్రమంలో సంయమనం పాటిస్తున్నందుకు ఇరు వర్గాలకు హోంమంత్రి పాటిల్ ధన్యవాదాలు తెలిపారు. లౌడ్స్పీకర్ల వినియోగంపై దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీని తీసుకురావాలని ఆయన కోరారు. హిందూ, ముస్లింల సహకారంతోనే రాష్ట్రంలో శాంతిభద్రతలను పర్యవేక్షించగలిగామని మంత్రి పేర్కొన్నారు.
మహారాష్ట్రలో శాంతిభద్రతల పరిస్ధితిపై సమీక్షా సమావేశంలో పాల్గొన్న అనంతరం పాటిల్ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో మసీదుల నుంచి లౌడ్స్పీకర్లను తొలగించని పక్షంలో మసీదుల వెలుపల భారీ శబ్ధంతో హనుమాన్ చాలీసా వినిపిస్తామని రాజ్ ఠాక్రే హెచ్చరించారు. మే 3లోగా మసీదుల్లో లౌడ్స్పీకర్లు తొలగించాలని ఆయన ఉద్ధవ్ ఠాక్రే సర్కార్కు డెడ్లైన్ విధించారు.