ముంబై, జూన్ 4: పార్టీలను చీల్చి..రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకున్న ఎన్డీయే కూటమికి మహారాష్ట్రలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్ వర్గం), ఎన్సీపీ (శరద్‌పవార్)లతో కూడిన మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) 30 స్థానాల్ని గెలుచుకుని సత్తాచాటింది. మొత్తం 48 ఎంపీ స్థానాల్లో 29 సీట్లను ఎంవీఏ కైవసం చేసుకుంది. బీజేపీకి ఈసారి 9 సీట్లు మాత్రమే దక్కాయి. శివసేన (షిండేవర్గం)-7, ఎన్సీపీ (అజిత్ వర్గం)-1 స్థానం గెలుచుకున్నాయి. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ బారామతిలో ఓడిపోయారు.
పార్టీ, గుర్తును లాగేసుకున్నా..
పార్టీలను అడ్డదిడ్డంగా చీల్చేశారు. గుర్తులను కూడా బలవంతంగా లాగేసుకున్న బీజేపీ ప్రజల అభిమానాన్ని లాక్కోలేకపోయింది. అధికార శివసేనను షిండే ద్వారా నిలువునా చీల్చేసిన బీజేపీ అక్కడితో ఆగలేదు, పార్టీ గుర్తును కూడా లాగేసుకుంది. ఆ తర్వాత అజిత్ పవార్‌కు పదవి ఆశ చూపి శరద్‌పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ని నిలువునా చీల్చి గుర్తును లాగేసుకుంది. అయితేనేం.. ప్రజల మనసుల్లో ఆ పార్టీల్లో ఉన్న అభిమానాన్ని తుడిచేయలేకపోయింది.