Elections Results | ముంబై, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ శనివారం జరగనుంది. రెండు రాష్ర్టాల్లోనూ హోరాహోరీ పోరు జరగడం, ఎగ్జిట్ పోల్స్‌లోనూ గెలుపెవరిదో నిర్దిష్టంగా తేలకపోవడంతో కౌంటింగ్‌పై ఉత్కంఠ నెలకొన్నది. రెండు రాష్ర్టాల ఫలితాల ప్రభావం వచ్చే ఏడాది జరగనున్న ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై పడే అవకాశం ఉండటంతో జాతీయ స్థాయిలోనూ ఫలితాలపై ఆసక్తి నెలకొన్నది.
ఎన్నికల ఫలితాలు రాకముందే ముఖ్యమంత్రి పీఠంపై పేచీ మొదలైంది. ఎన్నికల్లో మహాయుతి గెలుస్తుందని, అజిత్ పవార్ కాబోయే సీఎం అంటూ ఆయన పోటీ చేసిన బారామతి నియోజకవర్గంలో పోస్టర్లు వెలిశాయి. ఏక్నాథ్ షిండే మరోసారి సీఎం అవుతారని శివసేన నమ్మకంగా ఉంది. మరోవైపు మహావికాస్ అఘాడీ(ఎంవీఏ)లోనూ సీఎం పదవిపై పోరు మొదలైంది. కాంగ్రెస్ నేత పటోలే ప్రకటనతో శివసేన(ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ విభేదించారు.