భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు ఓటింగ్ నమోదైంది. శుక్రవారం పోలింగ్ సమయం ముగిసేటప్పటికి 71.16 శాతం ఓట్లు పోలయ్యాయి. మధ్యప్రదేశ్‌లోని మొత్తం 230 స్థానాలకు శుక్రవారం ఒకే విడతలో పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. ఇప్పుడు అభ్యర్థుల భవితవ్యం ఈవీఎం మిషన్లలో నిక్షిప్తమై ఉన్నది. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడికానున్నాయి.
అదేవిధంగా ఛత్తీస్‌గఢ్‌లో కూడా రెండో విడతలో భాగంగా 70 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లోని మొత్తం 90 స్థానాలకుగాను ఈ నెల 7న తొలి విడతలో 20 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. మిగత 70 స్థానాలకు ఇవాళ పోలింగ్ జరిగింది. శుక్రవారం పోలింగ్ సమయం ముగిసేటప్పటికి 68.15 శాతం పోలింగ్ నమోదైంది. ఫలితాలు డిసెంబర్ 3న వెల్లడికానున్నాయి.