సిటీబ్యూరో, మార్చి 19 (నమస్తే తెలంగాణ): మక్కా మసీదు వద్ద శుక్రవారం నిర్వహించే జుమాతుల్ విదా ప్రార్థనల దృష్ట్యా చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్ర 4 గంటల దాకా వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. నయాపూల్ నుంచి చార్మినార్ వైపు వచ్చే వాహనాలను మదీనా జంక్షన్ వద్ద సిటీ కాలేజీ వైపు మళ్లిస్తారని చెప్పారు. నాగుల చింత, శాలిబండ నుంచి చార్మినార్ వైపు వచ్చే వాహనాలను హిమ్మత్‌పురా జంక్షన్ వద్ద హరిబౌలి, వోల్గా హోటల్ వైపు మళ్లిస్తారు.
చౌక్ మైదాన్ నంచి వచ్చే వాహనాలను కోట్లా అలీజా లేదా మొఘుల్పురా వైపు.. మూసాబౌలి నుంచి వచ్చే వాహనాలను మోతీగల్లి వద్ద ఖిల్వత్ గ్రౌండ్, రాజేశ్ మెడికల్ హాల్, శాలిబండ, ఫతే దర్వాజ వైపు.. గుల్జార్ హౌస్ వైపు వచ్చే వాహనాలను ఏతబార్ చౌక్ వద్ద మండి మీరాలం మార్కెట్ లేదా బీబీ బజార్ వైపు మళ్లిస్తారు. మిట్టి కా షేర్ నుంచి గుల్జార్ హౌస్ వైపు వాహనాలను అనుమతించరని వెల్లడించారు. వీటిని ఘాన్సీ బజార్ మీదుగా హైకోర్టు రోడ్డు, ఖిల్వత్ వైపు మళ్లిస్తారు.
అవసరాన్ని బట్టి ఏపీఏటీ నుంచి వచ్చే వాహనాలను మండి మీరాలం మార్కెట్ వైపు మళ్లిస్తామని ట్రాఫిక పోలీసులు తెలిపారు. మదీనా, పత్తర్‌గట్టి నుంచి వచ్చే భక్తుల కోసం గుల్జార్ ఫంక్షన్ హాల్లో పార్కింగ్ సౌకర్యం కల్పించారు. యాకుత్‌పురా, నూర్ఖాన్ బజార్, తలాబ్ కట్టా, దబీర్‌పురా నుంచి వచ్చేవారి కోసం ముఫీద్ ఉల్ అనామ్ గ్రౌండ్, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా నుంచి వచ్చే వారికి చార్మినార్ బస్ టెర్మినల్‌లో సంతోష్‌నగర్, తలాబ్ కట్టా, మొఘుల్ పురా నంచి వచ్చే వారి కోసం ఖిల్వత్ గ్రౌండ్లో పార్కింగ్ స్థలం కేటాయించారు.
కిషన్‌బాగ్, బహదూర్‌పురా, హుస్సేనీ ఆలం నుంచి వచ్చే వారి కోసం పాత పెన్షన్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా సికింద్రాబాద్‌లోని సుభాష్‌రోడ్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మూసివేస్తారని వెల్లడించారు. ఈ ఆంక్షలు ఆర్టీసీ బస్సులకు కూడా వర్తిస్తాయని సిటీ బస్సులు అఫ్జల్‌గంజ్ వద్దే నిలుపుతారని, జిల్లా బస్సులు చాదర్‌ఘాట్, సైదాబాద్, మిధాని మీదుగా మళ్లిస్తారని చెప్పారు.