సిటీబ్యూరో, మార్చి 19 (నమస్తే తెలంగాణ): కొండ నాలుకకు మందు వేస్తే.. ఉన్న నాలుక ఊడినట్లుగా రిజిస్ట్రేషన్ శాఖ వ్యవస్థ మారింది. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే సంస్కరణల పేరిట ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసే విధానాలను అమల్లోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా స్లాట్ బుకింగ్ విధానం జనాలకు చుక్కలు చూపిస్తుండగా, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కనీస మౌలిక వసతులు కరువయ్యాయి. తాగేందుకు మంచి నీళ్లు లేకుండా పోయాయని జనాలు మండిపడుతున్నారు.
ఇక స్లాట్ బుకింగ్ విధానం అమలు చేస్తున్నా.. కార్యాలయంలోకి వచ్చి, ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం గంటన్నర సమయం పడుతుందని ఆవేదన చెందుతున్నారు. గతంలో మాదిరి అప్పటికప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు లేకపోవడంతో.. దళారులు, డాక్యుమెంట్ రైటర్లకు అవకాశం ఏర్పడింది. ఉన్నఫళంగా స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి అందిన కాడికి కొందరు డాక్యుమెంట్ రైటర్లు దోచుకుంటున్నారు. నేరుగా అధికారులతోనే వ్యవహారాలు చక్కబెడుతూ.. జనాలకు చుక్కలు చూపిస్తున్నారు. పోనీ ఇవన్నీ చదివించుకున్నాం కదా.. ఇక రిజిస్ట్రేషన్ నిమిషాల్లో అవుతుందంటే పొరపాటే.. కనీసం గంటకు పైగా తరబడి నిలబడాల్సి వస్తుందట. కనీసం మూత్రవిసర్జన కోసం సరైన టాయిలెట్లు కూడా కల్పించలేని స్థాయిలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు దర్శనమిస్తున్నాయి.
అగమ్యగోచరంగా
రిజిస్ట్రేషన్ విధానాన్ని సరళతరం పేరిట కాంగ్రెస్ సర్కార్ చేసిన రిపేర్లు.. అసలు వ్యవస్థను అగమ్యగోచరంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. డెడికేటెడ్ స్లాట్ బుకింగ్ విధానంతో, సర్కారు చేసిన ప్రయోగం విఫలమైంది. దీంతో జనాలకు మెరుగైన సేవలు విషయం పక్కన పెడితే.. రిజిస్ట్రేషన్ కోసం గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తుందని, ఇక స్లాట్ కోసమైతే 10-15 రోజుల వెతికినా దొరికే పరిస్థితి లేకుండా పోతున్నదని వాపోతున్నారు. పరిమిత స్లాట్లతో సర్కారు చేసిన మార్పులతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అమ్ముకునే వీల్లేదు…
పరిమిత స్లాట్ విధానంతో ఉన్న పళంగా అమ్ముకునే వీలు జనాలకు కరువైంది. అసలే మార్కెట్ కోలుకోలేని పరిస్థితిలో ఉంది. అమ్మకాలు మందగించాయి. కనీసం అప్పటికప్పుడు అమ్ముకునే క్రమంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను ముందర వేసుకుంటే…. స్లాట్ల కోసం డాక్యుమెంట్ రైటర్ల చుట్టూ తిరగాల్సి వస్తుందంటున్నారు. పోనీ స్లాట్ దొరికిన రోజైనా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగుస్తుందా? అంటే కనీసం ఐదారు గంటల పాటు కార్యాలయంలో ఉంటే తప్ప.. ఇంకో పనిచేసుకునే అవకాశమే లేదని రియల్ ఎస్టేట్ వ్యాపారులే చెబుతున్నారు.
కనీసం గంటల తరబడి కార్యాలయంలో ఉండే జనాల కోసమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలోనూ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు కొన్ని ప్రధాన ఎస్ఆర్వో కార్యాలయాల్లో రోజుకు 150-200 రిజిస్ట్రేషన్ జరిగిన సందర్భాలు ఉన్నాయి. రాత్రి 12 గంటల వరకు సబ్ రిజిస్టార్లు అందుబాటులో ఉండి పనిచేసేవారు. కానీ లిమిటెడ్ స్లాట్ బుకింగ్ పద్ధతిలో జనాలకు అదనంగా వచ్చే ప్రయోజనమే లేదని, కేవలం డాక్యుమెంట్ రైటర్లు, ఎస్ఆర్వో సిబ్బందికి మాత్రమే లబ్ధి చేకూరుతుందని పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆరోపిస్తున్నారు.
లక్షల్లో ఫీజులు..మౌలిక వసతులు కరువు
రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు స్థిరాస్థి కొనుగోలుదారులు 7-8 శాతం మేర లక్షల్లో ఫీజులు చెల్లిస్తున్నారు. కానీ కొనుగోలు చేసిన ఆస్తులకే రక్షణ లేని పరిస్థితులు ఇటీవల ఎదురవుతున్నాయి. వీటిని సర్కార్ రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలో పెట్టడమో లేక, ప్రభుత్వ భూములని కూలగొట్టి, స్వాధీనం చేసుకోవడం సర్వసాధారణంగా జరుగుతున్నాయి. ఇక రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయానికి వచ్చేవారికి కనీసం కూర్చుకునేందుకు సరిపడా కుర్చీలు కూడా ఏర్పాటు చేసే పరిస్థితిలో రిజిస్ట్రేషన్ శాఖ లేకుండా పోయింది.
పక్కా భవనాల పేరిట సర్కార్ హడావుడి చేస్తుందే తప్ప.. ముందుగా కార్యాలయాలకు వచ్చే వారికి మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. లక్షల రూపాయలను చార్జీల రూపంలో వసూలు చేస్తున్న సర్కార్… కనీస మౌలిక వసతులను ఎందుకు కల్పించడం లేదని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నారగోని ప్రవీణ్ ప్రశ్నించారు. ఇక డాక్యుమెంట్ రైటర్లను నమ్ముకుని, రికార్డుల్లో జరిగే తప్పిదాలను కూడా సరిచేసుకునే వెసులుబాటు సబ్ రిజిస్ట్రార్లకు లేకపోవడంతో… అనవసరంగా రెక్టిఫికేషన్ కోసం మరోసారి ఫీజులు చెల్లించాల్సి వస్తున్నదని, ఇలాంటి చిన్నచిన్న అంశాలతో జనాలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పన్నుల రూపంలో కష్టార్జితాన్ని గుంజుకుంటున్నాయని మండిపడ్డారు.