భోపాల్: కరోనా (Covid-19) సెకండ్ వేవ్‌లో ఒక వ్యక్తి మరణించినట్లు వైద్యులు నిర్ధారించాడు. అప్పటి నిబంధనల ప్రకారం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించలేదు. మున్సిపల్ సిబ్బంది అంత్యక్రియలు నిర్వహించారు. అయితే రెండేళ్ల తర్వాత ఆ వ్యక్తి సజీవంగా తిరిగి వచ్చాడు. తన కుటుంబ సభ్యులను కలిసి ఇంత కాలం తాను ఎక్కడ ఉన్నాడో చెప్పాడు. మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 2021లో కొవిడ్ సెకండ్ వేవ్‌లో కరోనా సోకిన 30 ఏళ్ల కమలేష్ చికిత్స పొందుతూ చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. అయితే అతడి మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించలేదు. అప్పటి నిబంధనల ప్రకారం కరోనా వల్ల చనిపోయిన మృతదేహాలకు మున్సిపల్ సిబ్బందే అంత్యక్రియలు నిర్వహించారు.
కాగా, రెండేళ్ల తర్వాత కమలేష్ సజీవంగా తిరిగి ఇంటికి చేరుకున్నాడు. దీంతో అతడ్ని చూసి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. భార్యతోపాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా కమలేష్‌ను గుర్తుపట్టారు. అతడు ఎలా బతికి వచ్చాడని ఆరా తీశారు. అయితే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ఒక ముఠా తనను అక్కడ బంధించినట్లు కమలేష్ తెలిపాడు. రోజు విడిచి రోజు వారు తనకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చినట్లు చెప్పాడు. ఆ ముఠా నుంచి తప్పించుకుని బయటపడినట్లు వెల్లడించాడు.
మరోవైపు కమలేష్ సజీవంగా తిరిగి వచ్చిన సంగతిని అతడి కుటుంబ సభ్యులు స్థానిక మున్సిపల్ అధికారులకు తెలిపారు. దీంతో రెండేళ్ల కిందట కరోనా వల్ల మరణించిన వ్యక్తి ఎవరు అన్నది అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: