లక్నో: ఒక వ్యక్తి పెళ్లి కోసం తెగ ఆరాటపడ్డాడు. రైతు అయిన తనను పెళ్లి చేసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని ఆధ్యాత్మిక కార్యక్రమంలో వాపోయాడు. ఈ వీడియో వైరల్ కావడంతో ఒక మహిళ అతడ్ని ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నది. (Newly-Wed Wife Murdered Man) కొన్ని రోజులకే ఆ వ్యక్తిని హత్య చేసి డబ్బు, నగలతో పారిపోయింది. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ జిల్లా పద్వార్ (ఖిటోలా) గ్రామానికి చెందిన 45 ఏళ్ల ఇంద్రకుమార్ తివారీ వ్యవసాయంతోపాటు పార్ట్ టైమ్ టీచర్‌గా పని చేస్తున్నాడు.
కాగా, మేలో జరిగిన గురు అనిరుద్ధాచార్య మహారాజ్ ఆధ్యాత్మిక ప్రసంగం కార్యక్రమంలో ఇంద్రకుమార్ పాల్గొన్నాడు. 18 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నప్పటికీ తనకు పెళ్లి కావడం లేదని, వధువు దొరకడం లేదని, తనను, తన ఆస్తిని చూసుకునేందుకు ఎవరూ లేరంటూ అనిరుద్ధాచార్య ఎదుట వాపోయాడు. ఇది విని అక్కడున్న వారంతా నవ్వుకున్నారు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఇంద్రకుమార్ భూమిని కాజేసేందుకు ఒక ముఠా అతడ్ని ట్రాప్ చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన సాహిబా బానో అనే మహిళ ‘ఖుషి తివారీ’ పేరుతో సోషల్ మీడియాలో పరిచయమైంది. అతడ్ని పెళ్లి చేసుకుంటానని నమ్మించింది. కుషినగర్‌కు రావాలని చెప్పింది.
Newly Wed Wife
ఎట్టకేలకు తనకు పెళ్లి కాబోతున్నందుకు ఇంద్రకుమార్ ఎంతో సంతోషించాడు. పెళ్లి చేసుకునేందుకు కుషినగర్ వెళ్తున్నట్లు బంధువులతో చెప్పాడు. ‘ఖుషి తివారీ’గా నమ్మించిన సాహిబా బానోను కలిశాడు. ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అయితే తనకు వివాహమైందన్న ఆనందంలో ఉన్న ఇంద్రకుమార్‌కు నవ వధువు షాక్ ఇచ్చింది. తన అనుచరులతో కలసి అతడ్ని హత్య చేసింది. అతడి వద్ద ఉన్న డబ్బు, నగలతో పారిపోయింది.
జూన్ 6న కుషినగర్‌లోని జాతీయ రహదారి పక్కనున్న పొదల్లో ఇంద్రకుమార్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. అతడి మెడలో కత్తి దిగి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ హత్యపై దర్యాప్తు చేసిన పోలీసులు సాహిబా బానోను అరెస్ట్ చేశారు. ‘ఖుషి తివారీ’ పేరుతో నకిలీ ఆధార్‌ను ఆమె సృష్టించిందని కుషినగర్ పోలీస్ అధికారి తెలిపారు. ఇంద్రకుమార్ ఆస్తి కోసం అతడ్ని ట్రాప్ చేసిన ఆమె తన అనుచరులతో కలిసి హత్య చేసిందని చెప్పారు. మిగతా నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. మధ్యప్రదేశ్ పోలీసుల సమన్వయంతో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Karnataka | కళ్లలో కారం కొట్టి.. మెడపై కాలు పెట్టి.. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య