Lok Sabha Elections | భోపాల్, ఏప్రిల్ 21: దేశంలో బీజేపీ కంచుకోటగా చెప్పే రాష్ర్టాల్లో మధ్యప్రదేశ్ ముందు వరుసలో ఉంటుంది. 1999 నుంచి అన్ని లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌పై బీజేపీ ఇక్కడ స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శిస్తున్నది. 2004, 2009 ఎన్నికల్లో యూపీఏ అధికారంలోకి వచ్చినా మధ్యప్రదేశ్‌లో మాత్రం బీజేపీకే కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు వచ్చాయి. 2014 ఎన్నికల్లో ఏకంగా 29 స్థానాలకు 27, 2019లో 28 స్థానాలను దక్కించుకున్న కమలం పార్టీ దాదాపు క్లీన్‌స్వీప్ చేసేసింది. ఈసారి కూడా ఇవే ఫలితాలను రిపీట్ చేయాలని పట్టుదలగా ఉంది. ఐదు నెలల క్రితమే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఆ పార్టీకి మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది.
ఇక, బీజేపీని కంచుకోటలోనే నిలువరించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నది. ఈసారి ఎలాగైనా రెండంకెల స్థానాలను సాధించుకొని పరువు నిలుపుకోవాలని తాపత్రయపడుతున్నది. ఇతర చిన్న పార్టీలు పోటీ చేస్తున్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం బీజేపీ – కాంగ్రెస్ మధ్యనే ఉన్నది. రెండు పార్టీలూ ఈసారి రాష్ట్రంలో కొత్త నాయకత్వంతో ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. నాలుగు దశల్లో ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఏప్రిల్ 19న మొదటి దశ పూర్తయ్యింది. ఏప్రిల్ 26, మే 7, మే 13న మిగతా దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.
మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఎక్కువగా ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మానే నమ్ముకుంది. అయోధ్యలో రామమందిర నిర్మాణం, హిందూత్వ అంశం కూడా తమకు ఓట్లు రాలుస్తాయని బీజేపీ భావిస్తున్నది. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ గెలవడంతో, రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉండాలనే బీజేపీ డబుల్ ఇంజిన్ నినాదం కూడా ప్లస్ అవుతుందని లెక్కలు వేసుకుంటున్నది. అయితే, ఇంతకుముందు బీజేపీకి శివరాజ్ సింగ్ చౌహాన్ లాంటి రాష్ట్రస్థాయి నాయకుల ఇమేజ్ కూడా కలిసొచ్చింది. కానీ, ఈసారి ఆ పరిస్థితి కనిపించడం లేదు. కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారనుకున్న శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను తప్పించి జూనియర్ అయిన మోహన్ యాదవ్‌ను బీజేపీ హైకమాండ్ ముఖ్యమంత్రిని చేసింది.
నరేంద్ర సింగ్ తోమర్, కైలాశ్ విజయ్‌వర్గీయ లాంటి సీనియర్ నాయకులను కూడా పక్కనపెట్టేసింది. ఇది లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ప్రతికూలంగా మారవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, మోహన్ యాదవ్ ఓబీసీ కావడం వల్ల ఓబీసీ ఓట్లు పెరుగుతాయని బీజేపీ ఆశిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు, నిరుద్యోగం, దళితులపై దాడులు వంటి అంశాలు సైతం బీజేపీకి ఇబ్బందిగా మారొచ్చు.
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పరిస్థితి లోక్‌సభ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు చాలా భిన్నంగా ఉంటున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి దాదాపు 40 శాతానికి పైగా ఓట్లు వస్తున్నాయి. అయితే, లోక్‌సభ ఎన్నికలకు వచ్చే నాటికి కాంగ్రెస్ ఓట్లు 30 – 35 శాతానికి పడిపోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేసిన వారు కూడా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి మళ్లుతున్నారు. 2018 చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 40.89 శాతం ఓట్లు వస్తే లోక్‌సభ ఎన్నికల్లో 34.5 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయినా 40.45 శాతం ఓట్లు సాధించింది. ఈ ఓట్లను లోక్‌సభ ఎన్నికల్లోనూ నిలుపుకోగలిగితే కమలం పార్టీ దూకుడుకు కాంగ్రెస్ కొంతవరకైనా అడ్డుకట్ట వేయగలదు. కానీ, ఈ పరిస్థితి ఉందని కచ్చితంగా చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ కమల్‌నాథ్, దిగ్విజయ్ సింగ్, సురేశ్ పచోరీ, అజయ్ సింగ్, అరుణ్ యాదవ్ వంటి సీనియర్ నేతలను పక్కనపెట్టి కొత్త నాయకత్వాన్ని తెరమీదకు తెచ్చింది. ఓబీసీ నేత జితు పట్వారీని పీసీసీ అధ్యక్షుడిగా, గిరిజన నేత ఉమాంగ్ సింఘార్ను ప్రతిపక్ష నేతను చేసింది. వీరి ద్వారా ఆ వర్గాల ఓట్లను ఆకర్షించవచ్చని కాంగ్రెస్ భావిస్తున్నది. అయితే, కమల్‌నాథ్ బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం, నేతల మధ్య సమన్వయలోపం, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం కాంగ్రెస్‌కు మైనస్ కావొచ్చు. కనీసం రెండంకెల సీట్లు గెలుచుకోవాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకున్నది. ముఖ్యంగా 2009లో గెలిచిన 12 సీట్లపై ఆ పార్టీ ప్రధానంగా ఫోకస్ చేసింది. మధ్యప్రదేశ్‌లోని వింధ్య, చందల్ ప్రాంతాల్లో బీఎస్పీ చీల్చే ఓట్లు కాంగ్రెస్‌కు నష్టం చేసే అవకాశం ఉంది.
ఈసారి కూడా మధ్యప్రదేశ్‌లో కమలం పార్టీకే అనుకూల పరిస్థితులు ఉన్నాయని సర్వేలు చెప్తున్నాయి. దాదాపుగా అన్ని సర్వేలు బీజేపీ 20కి పైగా స్థానాలు గెలుస్తుందని అంచనా వేశాయి. అయితే, కాంగ్రెస్‌కు 40 శాతం వరకు ఓట్లు వస్తాయని చెప్తున్నాయి. ఈ లెక్కల ప్రకారం కాంగ్రెస్‌కు ఇంకొంత ఓట్ల శాతం పెరిగితే బీజేపీకి బలమైన పోటీ ఇచ్చే అవకాశం ఉంది. లేకపోతే మరోసారి మధ్యప్రదేశ్ బీజేపీ వైపే నిలిచే అవకాశం ఉంది.
2019 ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ గెలిచిన ఏకైక స్థానం చింద్వారా. 2014లో గెలిచిన రెండుస్థానాల్లో ఇది ఒకటి. ఇది మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు కంచుకోట లాంటిది. ఇక్కడి నుంచి ఆయన తొమ్మిదిసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఒకసారి ఆయన భార్య అల్కానాథ్ గెలిచారు. గత ఎన్నికల్లో ఆయన కుమారుడు నకుల్‌నాథ్ విజయం సాధించారు. గత 44 ఏండ్లలో 43 ఏండ్లు చింద్వారా స్థానం కమల్‌నాథ్ కుటుంబం చేతిలోనే ఉంది. ఇక్కడ క్రమంగా కాంగ్రెస్‌కు మెజారిటీ తగ్గుతూ వస్తున్నది. గత ఎన్నికల్లో కేవలం 37 వేల మెజారిటీతో నకుల్‌నాథ్ గట్టెక్కారు. ఈసారి కచ్చితంగా చింద్వారా సీటును గెలుచుకోవాలని పట్టుదలగా ఉన్న బీజేపీ వివేక్ సాహును బరిలోకి దింపింది. కాంగ్రెస్ తరపున మరోసారి నకుల్‌నాథ్ బరిలో నిలిచారు. వీరిద్దరి మధ్య హోరాహోరీ పోటీ నెలకొన్నది.