Tejashwi Yadav | బీహార్ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. ఆ రాష్ట్రంలో ఈ ఏడాది ఆఖరులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ అధికార ఎన్డీఏ నేతలకు, ప్రతిపక్ష ఆర్జేడీ నేతలకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎన్నికల షెడ్యూల్ రాకముందే రెండు వైపుల నుంచి ఆరోపణలు, ప్రత్యారోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా బీహార్ సీఎం (Bihar CM) నితీశ్ కుమార్ (Nitish Kumar), మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు తారాస్థాయికి చేరాయి. తాజాగా సీఎం నితీశ్ కుమార్‌పై తేజస్వి యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నితీశ్‌ను తాను రెండుసార్లు ముఖ్యమంత్రిని చేశానంటూ వ్యాఖ్యానించారు.
ఇటీవల బీహార్ అసెంబ్లీలో నితీశ్ సర్కారు బీహార్‌కు ఏం చేసిందని తేజస్వి ప్రశ్నిస్తే.. నీ తండ్రిని నాయకుడిని చేసిందే నేనని నితీశ్ కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తేజస్వి యాదవ్ బుధవారం స్పందించారు. జేడీ(యూ) చీఫ్ నితీశ్‌కు రెండుసార్లు రాష్ట్రంలో అత్యున్నత పదవిని దక్కించుకోవడానికి తానే సాయం చేసినట్లు చెప్పారు. చిక్కుల్లో పడ్డ ఆయన పార్టీని తానే ఆదుకున్నానని వ్యాఖ్యానించారు.
‘సీఎం నితీశ్ కుమార్ మంగళవారం అసెంబ్లీలో ప్రసంగిస్తూ లాలూ ప్రసాద్ యాదవ్‌ను ముఖ్యమంత్రిని చేసింది తానేనని చెప్పారు. లాలూ యాదవ్ చాలా మందికి ఎన్నో రకాలుగా సాయం చేశారు. ప్రధాన మంత్రులను చేసిన ఘనత లాలూకు ఉంది. లాలూ ప్రసాద్ యాదవ్ సంగతి వదిలేస్తే.. నితీశ్ గురించి చెప్పాలి. నితీశ్ పార్టీ చిక్కుల్లో పడ్డప్పుడు నేనే ఆదుకున్నా. ముఖ్యమంత్రి పదవిని నిలబెట్టుకోవడం కోసం ఆయన్ని నేను రెండుసార్లు కాపాడాను. లేదంటే ఆయన పార్టీ ఇప్పటికే అంతమైపోయి ఉండేది’ అంటూ పాట్నాలో జరిగిన ఓ ర్యాలీలో మాట్లాడుతూ తేజస్వి ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల బీహార్ అసెంబ్లీలో కూడా తేజస్వియాదవ్, నితీశ్‌కుమార్ మధ్య మాటల యుద్ధం జరిగింది. సీఎం నితీశ్ కుమార్ మాటిమాటికి 2005కు ముందు బీహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ పాలన గురించి విమర్శలు చేస్తుండటాన్ని తేజస్వి యాదవ్ తప్పుపట్టారు. 2005కు ముందు బీహార్‌లో ఏముంది..? అని నితీశ్ ప్రశ్నించడంపై తేజస్వి మండిపడ్డారు. 2005కు ముందు బీహార్ రాష్ట్రమే లేదా..? అని ఎదురు ప్రశ్నించారు.
ఈ సందర్భంగా సీఎం నితీశ్ స్పందిస్తూ.. ‘2005కు ముందు బీహార్‌లో ఏముంది..? నీ తండ్రిని నాయకుడిని చేసిన నేను ఉన్నా. మీ సొంత జాట్ వర్గీయులు కూడా లాలూను ఎందుకు నాయకుడిని చేశావని అడుగుతున్నారు. కానీ నేను ఇప్పటికీ నీ తండ్రిని సపోర్టు చేస్తున్నా’ అని చెప్పారు. అనంతరం తేజస్వి మాట్లాడుతూ.. సీఎం నితీశ్ కుమార్ తన పరిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి 2005కు ముందు పాలన గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు.
బీహర్ సీఎం నితీశ్ కుమార్ 2005కు ముందు బీహార్లోనే ఇంజినీరింగ్ డిగ్రీ చేశారని గుర్తుచేశారు. 2005 కంటే ముందే బీహార్ నుంచి ఆయన కేంద్ర వ్యవసాయ మంత్రి అయ్యారని అన్నారు. ఇప్పుడు చర్చ జరుగుతున్న అసెంబ్లీ భవనం కూడా 2005 కంటే ముందు నిర్మించిందే అని చెప్పారు. బీహార్‌లో అన్నీ నితీశ్ కుమార్ సీఎం అయిన తర్వాతనే అందుబాటులోకి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. నితీశ్ సర్కారు ఇంకో 40 ఏండ్లు పాలించినా 2005కు ముందు ప్రభుత్వాన్ని నిందించేలా ఉందని వ్యాఖ్యానించారు.
Also Read..
“Tejashwi Yadav | మీకు 75 ఏళ్ల ముఖ్యమంత్రి కావాలా..? బీహార్ ప్రజలకు తేజస్వి యాదవ్ ప్రశ్న”