Bihar Assembly : బీహార్ అసెంబ్లీలో సీఎం నితీశ్ కుమార్, ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. సీఎం నితీశ్ కుమార్ మాటిమాటికి 2005కు ముందు బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ పాలన గురించి విమర్శలు చేస్తుండటాన్ని తేజస్వి యాదవ్ తప్పుపట్టారు. 2005కు ముందు బీహార్లో ఏముంది..? అని నితీశ్ ప్రశ్నించడంపై తేజస్వి మండిపడ్డారు. 2005కు ముందు బీహార్ రాష్ట్రమే లేదా..? అని ఎదురు ప్రశ్నించారు.
ఈ సందర్భంగా సీఎం నితీశ్ స్పందిస్తూ.. ‘2005కు ముందు బీహార్లో ఏముంది..? నీ తండ్రిని నాయకుడిని చేసిన నేను ఉన్నా. మీ సొంత జాట్ వర్గీయులు కూడా లాలూను ఎందుకు నాయకుడిని చేశావని అడుగుతున్నారు. కానీ నేను ఇప్పటికీ నీ తండ్రిని సపోర్టు చేస్తున్నా’ అని చెప్పారు. అనంతరం తేజస్వి మాట్లాడుతూ.. సీఎం నితీశ్ కుమార్ తన పరిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి 2005కు ముందు పాలన గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు.
బీహర్ సీఎం నితీశ్ కుమార్ 2005కు ముందు బీహార్లోనే ఇంజినీరింగ్ డిగ్రీ చేశారని గుర్తుచేశారు. 2005 కంటే ముందే బీహార్ నుంచి ఆయన కేంద్ర వ్యవసాయ మంత్రి అయ్యారని అన్నారు. ఇప్పుడు చర్చ జరుగుతున్న అసెంబ్లీ భవనం కూడా 2005 కంటే ముందు నిర్మించిందే అని చెప్పారు. బీహార్లో అన్నీ నితీశ్ కుమార్ సీఎం అయిన తర్వాతనే అందుబాటులోకి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. నితీశ్ సర్కారు ఇంకో 40 ఏండ్లు పాలించినా 2005కు ముందు ప్రభుత్వాన్ని నిందించేలా ఉందని వ్యాఖ్యానించారు.