Tejashwi Yadav : బీహార్ (Bihar) లో ఈ ఏడాది ఆఖరులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ అధికార ఎన్డీఏ నేతలకు, ప్రతిపక్ష ఆర్జేడీ నేతలకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎన్నికల షెడ్యూల్ రాకముందే రెండు వైపుల నుంచి ఆరోపణలు, ప్రత్యారోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా బీహార్ సీఎం (Bihar CM) నితీశ్ కుమార్ (Nitish Kumar), మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు తారాస్థాయికి చేరాయి.
తాజాగా బీహార్ రాజధాని పట్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆర్జేడీ అగ్ర నేత తేజస్వి యాదవ్ సీఎం నితీశ్ కుమార్‌పై విమర్శలు గుప్పించారు. నితీశ్ కుమార్‌ది అసమర్థ ప్రభుత్వమని ఇప్పుడు మనకు అసమర్థ ప్రభుత్వం అక్కర్లేదని అన్నారు. సాధారణంగా పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లని, మీరు ఇంకా 75 ఏళ్ల ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారా..? అని ప్రజలను ప్రశ్నించారు.
ఇప్పుడు బీహార్ రాష్ట్రాన్ని కొత్త వాహనంతో ముందుకు తీసుకెళ్లే సమయం ఆసన్నమైందని, ఈ చెత్తబండితో కాదని వ్యాఖ్యానించడం ద్వారా తేజస్వి యాదవ్ నితీశ్ సర్కారును చెత్తబండితో పోల్చారు. ఇటీవల బీహార్ అసెంబ్లీలో కూడా తేజస్వియాదవ్, నితీశ్‌కుమార్ మధ్య మాటల యుద్ధం జరిగింది. నితీశ్ సర్కారు బీహార్‌కు ఏం చేసిందని తేజస్వి ప్రశ్నిస్తే.. నీ తండ్రిని నాయకుడిని చేసిందే నేనని నితీశ్ కౌంటర్ ఇచ్చాడు. 2005కు ముందు బీహార్‌లో ఏముందని నితీశ్ ప్రశ్నిస్తే.. నువ్వు చదివింది, కేంద్రమంత్రివి అయ్యింది, ఈ అసెంబ్లీని నిర్మించింది 2005కు ముందేనని తేజస్వి కౌంటర్ ఎటాక్ చేశారు.