Low pressure area : నైరుతి బంగాళాఖాతం (Bay of Bengal) లో అల్పపీడనం (Low pressure area) ఏర్పడిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇది కేంద్రీకృతమైందని, దీని కారణంగా ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
రాగల 36 గంటల్లో ఈ అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉన్నందున, ప్రజలు చెట్ల కింద ఉండవద్దని ఆయన హెచ్చరించారు. అత్యవసర సహాయం లేదా సమాచారం కోసం ప్రభుత్వం ప్రత్యేక కంట్రోల్ రూమ్ నెంబర్లను అందుబాటులో ఉంచింది.
అత్యవసరమైతే ప్రజలు 112, 1070, 18004250101 టోల్ ఫ్రీ నెంబర్లను సంప్రదించాలని అధికారులు కోరారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.