న్యూఢిల్లీ జూలై 27 : వారం రోజుల అవాంతరాలు, ప్రతిష్టంభన అనంతరం సోమవారం నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు వాడీవేడిగా జరగనున్నాయి. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌పై పూర్తిగా కేంద్రీకృతం కానున్న ప్రత్యేక చర్చ సోమవారం లోక్‌సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధాన్ని సృష్టించే అవకాశం ఉంది. 16 గంటల చొప్పున ఉభయ సభలకు సమయం కేటాయించగా సోమవారం లోక్‌సభ, మంగళవారం రాజ్యసభలో ప్రత్యేక చర్చ ప్రారంభం కానున్నది.
భారత్, పాకిస్థాన్ మధ్య అణుయుద్ధం జరగకుండా కాల్పుల విరమణకు ఒప్పించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి అ అవకాశాన్ని వినియోగించుకోనున్నాయి. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు మొదటివారం ప్రతిపక్షాలు సృష్టించిన రభస కారణంగా వాయిదాల పర్వం కొనసాగింది.