మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 17:58:50

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌.. కన్న కూతురిని రూ.45వేలకు విక్రయించాడు

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌.. కన్న కూతురిని రూ.45వేలకు విక్రయించాడు

కొక్రాజార్‌ : కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ ఎంతో మంది నిరుపేదలు, వలస కూలీలను రోడ్డున పడేసింది. వందల మంది పేదలు ఆకలితో చనిపోయారు. దిక్కుతోచని స్థితిలో కడుపు నింపుకోవడం కోసం వారు చేయని ప్రయత్నం లేదు. 

తీవ్ర పేదరికం, పని లేకపోవడం వల్ల అసోంలో ఒక వలస కూలీ తన 15రోజుల కుమార్తెను రూ .45,000కు విక్రయించాడు. కొక్రాజార్ జిల్లాలోని అటవీ గ్రామమైన ధంటోలా మాండరియాలో నివసించే దీపక్ బ్రహ్మ గుజరాత్‌లో కూలి పనులు చేసుకొని జీవనం సాగించేవాడు. లాక్‌డౌన్‌ విధించడంతో ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. ఆ తరువాత దీపక్‌ తన కుటుంబంతో అదే జిల్లాలోని కొచుగావ్ పటకట గ్రామంలోని అతడి అత్తగారింట్లో నివసించేవాడు. అప్పటికే పనిలేక తీవ్ర పేదరికంలో ఉండగా దీపక్‌ భార్య రెండో సంతానంగా ఆడపిల్లకు జన్మనిచ్చింది. పెద్దకుమార్తె వయస్సు 1 సంవత్సరం. 

కరోనా విలయతాండం చేస్తుండగా దీపక్‌ బ్రహ్మ ఉద్యోగం కోసం ఎంతో ప్రయత్నం చేశాడు. కానీ అతడికి ఏ ఉద్యోగం దొరకలేదు. దాదాపు అన్ని దారులు మూసుకుపోవడంతో చేసేది లేక బ్రహ్మ తన నవజాత శిశువును విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. ఈ వ్యక్తి జూలై 2న తన భార్యకు తెలియకుండా 15 రోజుల కుమార్తెను ఇద్దరు మహిళలకు రూ.45,000కు అమ్మాడు. పాప ఏదని దీపక్‌ను భార్య ప్రశ్నించగా విక్రయించానని తెలుపడంతో వెంటనే గ్రామస్తుల సాయంతో భార్య కొచ్చుగావ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి ఆ ఇద్దరు మహిళల నుంచి శిశువును రక్షించి తల్లి  వడికి చేర్చారు. ఆ తరువాత బ్రహ్మను అరెస్టు చేశారు. తమకు సంతానం లేకపోవడంతోనే శిశువును కొన్నామని విచారణలో ఇద్దరు మహిళలు తెలియజేశారు. 

‘‘శిశువును రక్షించినందుకు పోలీసులకు నిజంగా కృతజ్ఞతలు. అయితే ఈ సమస్య చాలా తీవ్రమైంది. లాక్‌డౌన్‌ కారణంగా పేద ప్రజలకు ఉపాధి లేకుండా పోయింది. అటవీ గ్రామాల్లో నివసించేవారికి పరిస్థితి మరీ దారుణం’’అని నేడాన్ ఫౌండేషన్ చైర్మన్ దిగంబర్ నార్జరీ అన్నారు. 

లాక్‌డౌన్‌ సమయంలో పని లేక ఇతర రాష్ర్టాల నుంచి లక్షలాది మంది వలస కార్మికులు అసోంలోని తమ సొంత గ్రామాలకు చేరుకున్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం సహా వివిధ కార్యక్రమాల ద్వారా వారికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, కరోనా వ్యాప్తి రాష్ట్రంలోని చాలా ఆర్థిక కార్యకలాపాలను తీవ్రంగా దెబ్బతీసింది.

కరోనా కాటు వేస్తుంటే వరదలు రాష్ర్టాన్ని ముంచెత్తాయి. ఫలితంగా అసోం అతలాకుతలమైంది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో మొత్తం 28.32 లక్షల మంది వరదల బారిన పడి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇదిలో ఉండగా ఇప్పటివరకు 28791 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా మొత్తం 74 మంది కరోనాతో మరణించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo