న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: డీలిమిటేషన్‌తో ముడిపెడుతూ మహిళా రిజర్వేషన్ల బిల్లును తీసుకొచ్చిన మోదీ సర్కార్..పార్లమెంట్లో బొక్కాబోర్లా పడింది. దేశ రాజకీయాల్ని ఈ అంశం తీవ్రంగా కుదిపేస్తున్న తరుణంలో బీజేపీ తీరును విమర్శిస్తూ సీనియర్ నాయకురాలు, మాజీ సీఎం వసుంధర రాజే సొంత పార్టీ పైనే ఆగ్రహం వ్యక్తం చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ను ఉద్దేశించి ఆమె ఒక లేఖ రాశారని, దాంట్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు సహా పలు అంశాలను ప్రస్తావిస్తూ బీజేపీ తీరుపై తీవ్రంగా మండిపడ్డారంటూ ఆదివారం వార్తలు వెలువడ్డాయి. ఆమె రాసినట్టు పేర్కొన్నే లేఖ తెగ వైరల్ కావటంతో.. అది కాస్త రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. ఈ విషయంపై వసుంధర రాజే స్పందిస్తూ.. సోషల్ మీడియాలో వెలువడిన లేఖ నకిలీదని కొట్టిపారేశారు. ఇది కొంతమంది తప్పుడు వ్యక్తుల పనిగా ఆమె పేర్కొన్నారు. ‘సత్యానికి రక్షణ అవసరం లేదు. సోషల్ మీడియాలో వైరల్ అయిన లేఖ..కొంతమంది పని’ అని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. మహిళలకు సమాన భాగస్వామ్యం కల్పించేందుకు ప్రధాని మోదీ నాయకత్వంలో జరుగుతున్న ప్రయత్నాలకు తాను మద్దతు పలుకుతున్నానని, దేశవ్యాప్తంగా మహిళలు స్వాగతం పలుకుతున్నారని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.