హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రైతాంగం పడుతున్న ఇబ్బందులు, ఢిల్లీలో విద్యార్థులు, యువత చేస్తున్న పోరాటం నేపథ్యంలో తన బర్త్డే వేడుకలకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఆయన తన బర్త్డే వేడుకలకు అనవసర ఖర్చు వద్దంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వీలైతే ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని, సేవా కార్యక్రమాలకు వినియోగించాలని సూచించారు. ఢిల్లీలో విద్యార్థులు, యువత చేపట్టిన పోరాటానికి సంఘీభావంగా శుక్రవారం బీఆర్ఎస్ విద్యార్థి విభాగం (బీఆర్ఎస్వీ) నిర్వహించే నిరసన కార్యక్రమంలో పాల్గొననున్నట్టు కేటీఆర్ వెల్లడించారు. తన పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు కేక్ కటింగ్లు, ఫ్లెక్సీలు, హోర్డింగులు, పూల బొకేలు, పత్రికా ప్రకటనలు వంటి వాటిపై అనవసర ఖర్చు చేయొద్దని పార్టీ శ్రేణులు, అభిమానులు, శ్రేయోభిలాషులకు ఆయన విజ్ఞప్తి చేశారు. దేశం, రాష్ట్రంలో నెలకొన్న గంభీరమైన పరిస్థితుల నేపథ్యంలో పుట్టినరోజు సందర్భంగా సాధారణంగా గడుపాలని కేటీఆర్ నిర్ణయించుకున్నారు.