హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): రుతుపవన ద్రోణి సముద్ర మట్టం నుంచి జైసల్మేర్, కోట, గుణ, దామోహ్, డాల్టన్‌గంజ్, కాంటాయ్ మీదుగా ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వైపు కొనసాగుతున్నదని, ఇది సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తువరకు విస్తరించి, ఎత్తుకు వెళ్లేకొద్దీ దక్షిణ దిశగా వంగి ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే రెండు మూడు రోజుల పాటు రాష్ట్రంలో బ్రేక్ మాన్సూన్ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ నిపుణులు తెలంగాణ వెదర్‌మ్యాన్ వెల్లడించారు. ఈ విరామ సమయంలో వాతావరణం పూర్తిగా పొడిగా మారదని, హైదరాబాద్ నగరం సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సాయంత్రం అకడకడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపారు. ఒకట్రెండుచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నదని చెప్పారు. జూలై 25 లేదా 26వ తేదీ తర్వాత రాష్ట్రంలో వర్షాల తీవ్రత మళ్లీ పెరిగే అవకాశం ఉన్నదని అంచనా వేశారు. జూన్ 1 నుంచి జూలై 22 వరకు లెకలను పరిశీలిస్తే.. రాష్ట్ర సగటు వర్షపాతం సాధారణం కంటే -25 శాతం తకువగా నమోదైంది. జిల్లాలవారీగా చూసినట్టయితే అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 60 శాతం వర్షపాతం లోటు ఏర్పడింది. బుధవారం రాత్రి ఈ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో పాటు రాబోయే రోజుల్లో పడే వానల వల్ల ఈ లోటు కొంతవరకు తగ్గుతుందని వాతావరణ శాఖ భావిస్తున్నది.