బెంగళూర్ : నగరంలోని వైట్‌ఫీల్డ్ ప్రాంతంలో స్ధానికులు భయంతో వణికిపోతున్నారు. ఎంఎస్ ధోనీ ఇంటర్నేషనల్ స్కూల్ సమీపంలోని వీధుల్లో చిరుత (Leopard) ప్రత్యక్షం కావడంతో ఆ ప్రాంత వాసులను ఇండ్లలోనే ఉండాలని అధికారులు కోరుతున్నారు. తమ పిల్లల భద్రత కోసం తగిన జాగ్రత్తలు పాటించాలని తల్లితండ్రులను కోరుతూ స్కూల్ నిర్వాహకులు ఈమెయిల్ పంపారు.
సింగసంద్ర ప్రాంతంలో చిరుత కనిపించిందని తమ దృష్టికి వచ్చిందని, అయితే ఇప్పుడు అది జీబీ పాళ్యం వద్ద తిరుగాడుతోందని తెలిసిందని మెయిల్లో పేర్కొన్నారు. చిరుతను బంధించేందుకు అటవీ శాఖ కసరత్తు సాగిస్తోందని తెలిపారు.
స్కూల్ ప్రాంగణంలో తాము అదనపు భద్రతా చర్యలు చేపట్టామని తెలిపారు. తమ భద్రతా బృందం అప్రమత్తమైందని, ఈ ప్రాంతాన్ని నిశితంగా పరిశీలిస్తోందని, మీ పిల్లల క్షేమం కోసం మీ వైపు నుంచి కూడా అప్రమత్తత అవసరమని ఈ మెయిల్ పేర్కొంది. మరోవైపు చిరుతను గుర్తించేందుకు అటవీ అధికారులు, పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. వైట్‌ఫీల్డ్‌లో మళ్లీ చిరుత సంచరిస్తోంది..దాన్ని అటవీ అధికారులు సురక్షితంగా పట్టుకుంటారని ఆశిస్తున్నానని ఓ యూజర్ ట్విట్టర్లో రాసుకొచ్చారు.
Read More :