న్యూఢిల్లీ: ‘నేను అవినీతి చేయను.. ఇంకొకరిని చేయనివ్వను’.. ఇదీ ప్రధాని మోదీ తరచూ చెప్పే మాట. అయితే ఆయన చేతలు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. గతంలో తాము అవినీతి నేతలుగా ఆరోపణలు చేసిన వారిని పార్టీలోకి చేర్చుకోవడమే కాక, ఏకంగా ముఖ్యమంత్రి పదవులు కట్టబెట్టడమే ఇందుకు నిదర్శనం. నారద టేపులు, లూయిస్ బెర్జర్ స్కాండల్లో నిందితులుగా ఉన్న నేతలు నేడు బీజేపీలో చేరి ముఖ్యమంత్రులు కావడం బీజేపీ మార్క్ రాజకీయాలకు అద్దం పడుతున్నది. మోదీ హయాంలో అవినీతిని అంతం చేయడం కంటే, దాన్ని తమ సొంతం చేసుకోవడానికి బీజేపీ మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తున్నది. ఈ మేరకు వైర్ వెబ్సైట్ ఒక కథనాన్ని ప్రచురించింది.
ఆ కథనం ప్రకారం.. అస్సాంలో హిమంతను, బెంగాల్లో సువేందును ప్రధాని మోదీ సీఎంలుగా చేయడం చూస్తే ఇది నిజమేనని అనిపిస్తుంది. సువేందు అధికారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి కొన్ని నిమిషాల ముందు ఆయనపై 2016లో జరిగిన నారద స్టింగ్ ఆపరేషన్ వీడియోలను బీజేపీ తన సామాజిక మాధ్యమ ఖాతాల నుంచి తొలగించింది. గతంలో తాను అవినీతి ఆరోపణలు చేసిన వ్యక్తినే బెంగాల్ రక్షకుడిగా పట్టాభిషేకం చేసి మోదీ మౌనంగా ఉండిపోయారు. మోదీ హయాంలో ఇదొక ప్రామాణిక కార్యాచరణ పద్ధతిగా మారింది. ఇందులో నాలుగు దశలుంటాయి.
మొదటి దశ: ఒక విపక్ష నాయకుడిని కోట్ల రూపాయల కుంభకోణానికి సూత్రధారిగా ముద్ర వేస్తారు.
రెండో దశ : అలాంటి నాయకుడిపై చట్టపరమైన ఒత్తిడిని సృష్టించడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తారు.
మూడో దశ: ఆ తరువాత ఆ నాయకుడికి తమ పార్టీ కండువా కప్పి బీజేపీలోకి స్వాగతిస్తారు.
నాలుగో దశ: అలాంటి నాయకుడికే ముఖ్యమంత్రి లేదా మంత్రి పదవి బహుమతిగా ఇస్తారు.
గత పదేండ్లలో ఈడీ నమోదు చేసిన 190 కేసుల్లో 90 శాతం కేసులు విపక్ష నేతలపైనే ఉన్నాయి. ఇందులో రెండు కేసుల్లో మాత్రమే దోషులకు శిక్ష పడింది. అస్సాం సీఎం, మాజీ కాంగ్రెస్ నాయకుడైన హిమంత బిశ్వ శర్మ ఉదంతాన్ని ఉదాహరణగా తీసుకొంటే ఆయనపై లూయిస్ బెర్గర్ లంచం స్కామ్ ఆరోపణలు చేసిన బీజేపీ దానిపై వాటర్ గేట్ బుక్లెట్ను ప్రచురించింది. ఇప్పుడు ఆ బుక్లెట్ ఎక్కడా కనిపించడం లేదు. హిమంతను బీజేపీ ఇప్పుడు సీఎం చేయడమే కాకుండా ఈశాన్య భారతంలో తమ పార్టీ చక్రవర్తిగా చూస్తున్నది. ఆయన బీజేపీలో చేరగానే ఆయనపై ఉన్న అవినీతి ఆరోపణలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. దీని వల్లే బీజేపీకి ‘వాషింగ్ మెషీన్’ అనే ముద్దు పేరు వచ్చింది. ఇక హత్య కేసులో, ఎన్నికల అఫిడవిట్లో వయసును తప్పుగా పేర్కొనడంలో నిందితుడిగా ఉన్న సమ్రాట్ చౌదరి బీహార్లో బీజేపీలో చేరి సీఎం అయ్యారు.
2026 ఎన్నికల సమయంలో మోదీ ‘ఏం దోచుకొన్నారో అది తిరిగి ఇవ్వాల్సిందే’నని వ్యాఖ్యానించారు. అది ఇప్పుడు ఒక డొల్ల నినాదంగా మిగిలిపోయింది. ఆ ‘దోచుకొన్న సొమ్ము’ కొత్త సీఎంల ద్వారా బీజేపీ సొంత రాజకీయ ఖజానాకు చేరుతున్నట్టు అనిపిస్తున్నది! దీన్ని బట్టి అవినీతి అనేది కేవలం విపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే నేరమవుతుందని బీజేపీ పరోక్షంగా సంకేతమిచ్చింది.