న్యూఢిల్లీ, మార్చి 29: రిటైర్డ్ జడ్జిలను ఉద్దేశించి కేంద్ర న్యాయశాఖ మంత్రి రిజిజు చేసిన వ్యాఖ్యలపై న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటైర్డ్ న్యాయమూర్తులను ‘భారత వ్యతిరేక ముఠా’గా పేర్కొనడాన్ని ఖండించారు. ఈ వ్యాఖ్యలను పబ్లిక్‌గా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సుప్రీంకోర్టు, దేశంలోని హైకోర్టులకు చెందిన 323 మంది న్యాయవాదులు బుధవారం బహిరంగ ప్రకటన విడుదల చేశారు. ఎలాంటి అసమ్మతి స్వరాన్ని వదలబోమనే విధంగా కేంద్ర మంత్రి ప్రకటన ఉన్నదని లాయర్లు ఆక్షేపించారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే.. దేశాన్ని వ్యతిరేకించినట్టు కాదని స్పష్టం చేశారు. ఒక న్యాయశాఖ మంత్రిగా న్యాయవ్యవస్థతో పాటు ప్రస్తుత, మాజీ న్యాయమూర్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నదని, అయితే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే వ్యక్తులను టార్గెట్ చేసుకొని బెదిరింపులకు దిగడం సరికాదని హితవు పలికారు. బహిరంగ ప్రకటనపై సంతకాలు చేసిన వారిలో సీనియర్ అడ్వకేట్లు ఇక్బాల్ చాగ్లా, జనక్ ద్వారకాదాస్, కపిల్ సిబల్, ఏఏం సింఘ్వి, దుష్యంత్ దవే, అరవింద్ దాతర్, రాజు రామచంద్రన్, సీయూ సింగ్, శ్రీరామ్ పంచూ, గోపాల్ శంకరనారాయణ, నిత్య రామకృష్ణ, ప్రశాంత్ భూషణ్, సదన్ ఫరాసత్, వివిధ హైకోర్టులకు చెందిన న్యాయవాదులు ఉన్నారు.