Pahalgam attack | ఈనెల 22న జమ్ముకశ్మీర్‌లోని పెహల్గామ్లో మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరాన్ వ్యాలీలో ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. టూరిస్ట్లే లక్ష్యంగా విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) దర్యాప్తును ముమ్మరంగా చేస్తోంది. ఈ దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. తాజాగా పెహల్గామ్ ఉగ్రదాడి వెనుక లష్కరే తోయిబా కమాండర్ (Lashkar commander) ఫరూక్ అహ్మద్ (Farooq Ahmad) కీలక పాత్ర పోషించినట్లు తెలిసింది. ఈ మేరకు ఎన్ఐఏ వర్గాలు వెల్లడించినట్లు జాతీయ మీడియా నివేదిస్తోంది.
సదరు నివేదికల ప్రకారం.. పెహల్గామ్ దాడి తర్వాత కశ్మీర్ లోయలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం వేట మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పలు జిల్లాల్లోని ఉగ్రవాదులు, అనుమానితుల ఇళ్లను బాంబులతో పేల్చేస్తున్నాయి. కుప్వారాలోని ఫరూక్ అహ్మద్ ఇంటిని కూడా భద్రతా దళాలు ఇటీవలే కూల్చేశాయి. అహ్మద్ ప్రస్తుతం పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్నట్లు తెలుస్తోంది. తన స్లీపర్ సెల్ నెట్వర్క్ ద్వారా గత రెండేళ్లుగా కశ్మీర్లో పలు ఉగ్రదాడులు నిర్వహించడంలో అహ్మద్ కీలక పాత్ర పోషించినట్లు ఎన్ఐఏ గుర్తించింది. వీటిలో తాజాగా జరిగిన పెహల్గామ్ దాడి ఒకటి.
ఇక పాకిస్థాన్‌లోని మూడు సెక్టార్ల నుంచి కశ్మీర్లోకి ఉగ్రవాదులు చొరబడేందుకు అహ్మద్ సహకరిస్తున్నట్టు ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. ఈ లష్కర్ కమాండర్‌కు లోయలోని పర్వత మార్గాల గురించి విస్తృతమైన పరిజ్ఞానం ఉందని పేర్కొన్నాయి. నిఘా వర్గాల ప్రకారం.. అహ్మద్ 1990 నుంచి 2016 వరకూ పాక్ – భారత్ మధ్య పలుమార్లు ప్రయాణించినట్లు గుర్తించారు. పెహల్గామ్ దాడి తర్వాత ఫరూక్ అహ్మద్ సహాయకులను భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. గత రెండేళ్లుగా.. అహ్మద్ పాకిస్థాన్ నుంచి పనిచేస్తూ కశ్మీర్‌లోని తన నెట్‌వర్క్‌ను సంప్రదించడానికి సురక్షిత కమ్మూనికేషన్ యాప్‌లను ఉపయోగిస్తున్నట్లు కూడా నిఘా వర్గాలు తెలిపాయి.
Also Read..
Pak Nationals | దేశాన్ని వీడిన 786 మంది పాక్ పౌరులు.. అట్నుంచి 1,376 మంది రాక
PM Modi | మోదీ అధ్యక్షతన నేడు భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ భేటీ