KTR | హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ ) : లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేస్తుందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న డీలిమిటేషన్ విధానం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయ ప్రాతినిధ్యం తగ్గి, దక్షిణ, ఉత్తరాది రాష్ట్రాల మధ్య అంతరం పెరుగుతుందని హెచ్చరించారు. దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న దక్షిణాది రాష్ట్రాలను ప్రాతినిధ్యం పరంగా వెనుకకు నెట్టి, విభజన రాజకీయాలను ప్రోత్సహించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నదని ఆరోపించారు. ఈ ప్రతిపాదనను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. డీలిమిటేషన్ వల్ల కొన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం పెరగడం, మరికొన్ని రాష్ట్రాలకు తగ్గిపోవడం ప్రాంతీయ అసమతుల్యతను పెంచుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
జనాభా నియంత్రణ కోసం ప్రయత్నించిన దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం శిక్ష విధించినట్టుగా ఈ చర్య ఉంటున్నదని అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై సమగ్రంగా చర్చించేందుకు తమిళనాడులోని అధికారపక్షం డీఎంకే శనివారం దక్షిణాది రాష్ట్రాల అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసింది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రతినిధి బృందం శుక్రవారం సాయంత్రం చెన్నై చేరుకున్నది. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘జనాభా నియంత్రణను పాటించిన రాష్ట్రాలను ప్రోత్సహించాల్సిందిపోయి, డీలిమిటేషన్ విధానం వారిని శిక్షించేలా ఉన్నది’ అని మండిపడ్డారు. డీలిమిటేషన్ వల్ల కేవలం రాజకీయ ప్రాతినిధ్యం మాత్రమే తగ్గదని, కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా గణనీయంగా తగ్గిపోతాయని హెచ్చరించారు. దక్షిణాది రాష్ట్రాలు ఆర్థికంగా బలమైనవిగా ఉండటమే కాకుండా, దేశం మొత్తానికి పెద్దమొత్తంలో ఆదాయం సమకూరుస్తున్నాయని చెప్పారు.
డీలిమిటేషన్‌పై ఇప్పుడే గట్టిగా స్పందించాలని, లేకపోతే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించబోవని కేటీఆర్ హెచ్చరించారు. ఈ సమయంలో అన్ని దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉన్నదని, ఒకే గళంతో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించాల్సిన సమయం ఇదేనని పిలుపునిచ్చారు. ‘దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి ఈ ప్రతిపాదన పెద్ద అడ్డంకిగా మారనున్నది. ఇది కేవలం రాజకీయ సమస్య మాత్రమే కాదు. భవిష్యత్‌లో ఆర్థిక అసమతుల్యతను కూడా పెంచేలా ఉన్నది. ఇప్పుడు మౌనంగా ఉండటం నేరం. ఇది కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించిన సమస్య కాదు. ఇది మొత్తం దక్షిణాదికి సంబంధించిన అంశం. అందరం కలసి పోరాడితేనే మన హకులను కాపాడుకోగలం. ఒకసారి ప్రాతినిధ్యం తగ్గిపోతే మళ్లీ దాన్ని తిరిగి తెచ్చుకోవడం అసాధ్యం. అందుకే ఇప్పుడే పోరాడక తప్పదు’ అని కేటీఆర్ స్పష్టం చేశారు.
చెన్నైలో శనివారం జరిగే దక్షిణాది రాష్ట్రాల సమావేశంలో డీలిమిటేషన్ ప్రభావంపై సుదీర్ఘ చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విధానాన్ని ఎండగట్టి, దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గకుండా తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశంలో కేటీఆర్ ప్రత్యేకంగా ప్రసంగించి డీలిమిటేషన్ వల్ల కలిగే నష్టాలను వివరించనున్నారు. చెన్నై సమావేశం ద్వారా ఒక నిర్ణయం తీసుకుని, భవిష్యత్తులో ఒక కూటమిగా నిలిచి ఈ అన్యాయాన్ని సమిష్టిగా ఎదుర్కోనున్నాయి. ఈ సమావేశం ద్వారా దక్షిణాది రాష్ట్రాల ఐక్యత మరింత బలపడుతుందని, భవిష్యత్ రాజకీయాల్లో ఇది ఒక కీలకమైన మలుపు కావొచ్చని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. చెన్నై సమావేశం ద్వారా ఈ అంశంపై మరింత స్పష్టత రానుందని, దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిసి కేంద్రాన్ని ఒత్తిడికి గురి చేస్తాయని బీఆర్ఎస్ పార్టీ విశ్వాసం వ్యక్తం చేసింది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ నేతలు కేటీఆర్‌తోపాటు రాజ్యసభలో పార్టీ పక్ష నేత కేఆర్ సురేశ్ రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు హాజరుకానున్నారు.
కేంద్రం చేపట్టనున్న డీలిమిటేషన్ సమాఖ్యవాదం పునాదిపై దాడి అని, అది ప్రజాస్వామ్యాన్ని తుడిచిపెట్టేస్తుందని, మన హక్కుల విషయంలో రాజీపడేలా దిగజారుస్తుందని తమిళనాడు ముఖ్యమంతి ఎంకే స్టాలిన్ అన్నారు. డీలిమిటేషన్‌పై కొన్ని ప్రధాన రాష్ర్టాల ముఖ్యమంత్రులు, విపక్ష, ఇతర ముఖ్య నేతలతో ఆయన శనివారం చెన్నైలో సమావేశం కానున్నారు. తొలి జేఏసీ సమావేశం సందర్భంగా ఆయన శుక్రవారం ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. న్యాయమైన పునర్విభజన పొందడం మన హక్కని అన్నారు. 2026లో కేంద్రం పునర్విభజన చేపడుతుందని, ప్రస్తుత జనాభా ఆధారంగా దానిని చేపడితే పార్లమెంట్లో మన ప్రాతినిధ్యంపై గణనీయమైన ప్రభావం పడుతుందని, మన గళాలు మూగబోతాయని అన్నారు. 22న జరిగే జేఏసీ సమావేశానికి కేరళ సీఎం పినరయి విజయన్ చెన్నైకు చేరుకున్నారు. అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సమావేశానికి విచ్చేస్తారని భావిస్తున్నారు. జనాభా ప్రాతిపదికన పునర్విభనకు వ్యతిరేకంగా అనేక రాష్ర్టాలు చేతులు కలపడంతో ఇప్పుడు ఇది జాతీయ ఉద్యమంగా మారిందని స్టాలిన్ అన్నారు.