Viral news : అతడొక న్యాయవాది (Lawyer). పెళ్లిరోజు కానుకగా తన భార్యకు ఒక గిఫ్ట్ (Gift) ఇవ్వాలనుకున్నాడు. ఆ మేరకు ఓ మొబైల్ షాపులో రూ.49 వేల విలువ చేసే మొబైల్ ఫోన్ (Mobile Phone) కొన్నాడు. ఇంటికి తీసుకెళ్లి భార్య చేతిలో పెట్టాడు. ఆమె సంతోషంతో పొంగిపోయింది. ప్రేమతో భర్త తెచ్చిన మొబైల్‌ను ఆన్ చేసింది. అంతే.. కొన్ని నిమిషాల్లో పోలీసులు వచ్చి ఆ ఇంటి తలుపుతట్టారు. దాంతో ఆ దంపతులు షాకయ్యారు. పెళ్లిరోజు రాత్రి వారికి పీడకలగా మిగిలిపోయింది.
వివరాల్లోకి వెళ్తే.. కోల్‌కతాకు చెందిన ఓ న్యాయవాది పెళ్లిరోజు కానుకగా తన భార్యకు ఖరీదైన మొబైల్ ఫోన్ కొనిచ్చాడు. రూ.49 వేలు పెట్టి భర్త కొనిచ్చిన ఆ ఫోన్‌ను భార్య ఆన్ చేయగానే పోలీసులు రంగ ప్రవేశం చేశారు. గుజరాత్ రాష్ట్రం రాజ్‌కోట్‌కు చెందిన పోలీసులు ఆ ఇంటి తలుపుతట్టారు. తలుపు తీసిన దంపతులు పోలీసులను చూసి షాకయ్యారు.
ఆ ఫోన్‌తో సైబర్ నేరాలకు పాల్పడ్డారని పోలీసులు గద్దించడంతో భయంతో వణికిపోయారు. తాము ఇవాళే మొబైల్ షాపు నుంచి ఈ మొబైల్ కొనుగోలు చేశామని, తాము ఏ నేరం చేయలేదని చెప్పారు. రాజ్‌కోట్ పోలీసుల సూచన మేరకు ఆ దంపతులు రాత్రికిరాత్రే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు మొబైల్ షాపుపై రైడ్ చేశారు. ఆ షాపులో డాక్యుమెంట్స్ అన్నీ సక్రమంగానే ఉండటంతో మొబైల్స్ డిస్ట్రిబ్యూటర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
కాగా పెళ్లిరోజు నాడు సంతోషంగా గడుపుదామనుకున్న ఆ లాయర్ దంపతులకు మొబైల్ గిఫ్ట్ ఓ పీడకలను మిగిల్చింది. రాత్రంతా వారు పోలీస్స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఏ నేరం చేయకపోయినా తమ జీవితంలో ఓ ముఖ్యమైన రాత్రిన వారు అవస్థలు పడాల్సి వచ్చింది.