Kishan Reddy- Rammohan Naidu | ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారధ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి కొలువు దీరింది. 71 మంది మంత్రులతో ఆదివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ప్రధాని మోదీ.. మంత్రులకు శాఖలు కేటాయించారు. తెలంగాణలోని సికింద్రాబాద్ లోక్ సభా స్థానం నుంచి రెండోసారి గెలుపొందిన బీజేపీ నేత జీ కిషన్ రెడ్డికి బొగ్గు, గనుల శాఖ లభించింది. కరీంనగర్ నుంచీ రెండోసారి ఎన్నికైన బండి సంజయ్ కుమార్‌ను ప్రధాని మోదీ హోంశాఖ సహాయ మంత్రిగా నియమించారు. టీడీపీ నుంచి క్యాబినెట్ లోకి తీసుకున్న కింజారపు రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖ, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌కు గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖల సహాయ మంత్రి, నర్సాపురం ఎంపీ భూపతి రాజు శ్రీనివాస వర్మకు భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి పదవులు లభించాయి.
సికింద్రాబాద్ ఎంపీ జీ కిషన్ రెడ్డికి బొగ్గు, గనులశాఖలను ప్రధాని మోదీ కేటాయించారు. ఇంతకుముందు పర్యాటక శాఖ మంత్రిగా పని చేశారు. దేశంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ తయారీకి అవసరమైన బొగ్గు సరఫరా చేయడం కిషన్ రెడ్డికి అతిపెద్ద సవాల్ కానున్నది. కోల్ గ్యాసిఫికేషన్, కోల్ బెడ్ మిథేన్ తయారీలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. దేశంలో విద్యుత్ ఉత్పత్తిలో బొగ్గు కీలక పాత్ర పోషిస్తుందని జీ కిషన్ రెడ్డి సోమవారం ఢిల్లీలో మీడియాతో చెప్పారు. తనపై ప్రధాని మోదీ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు.
2019 ఎన్నికల్లో తొలిసారి సికింద్రాబాద్ లోక్ సభా స్థానం నుంచి గెలుపొందిన కిషన్ రెడ్డి, తాజా సార్వత్రిక ఎన్నికల్లోనూ సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి దానం నాగేందర్‌పై 49 వేల పై చిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించిన కిషన్ రెడ్డి 1977 నుంచి సాధారణ కార్యకర్తగా బీజేపీలో రాజకీయాల్లోకి ప్రవేశించారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, బీజేవైఎం జాతీయ అధ్యక్షుడిగానూ పని చేశారు. గత ప్రభుత్వంలో హోం, పర్యాటకం, సాంస్కృతికం, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖలను నిర్వహించారు. సికింద్రాబాద్ లోక్ సభా స్థానానికి ఎన్నికవ్వక ముందు 2004 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి రెండుసార్లు, తెలంగాణ అసెంబ్లీకి ఒకసారి ఎన్నికయ్యారు.
పార్లమెంటుకు మూడుసార్లు ఎన్నికైన శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడుకు తొలిసారే కేంద్ర పౌర విమానయాన శాఖ అప్పగించారు. గత ప్రభుత్వంలో విమానయానశాఖ నిర్వహించిన జ్యోతిరాదిత్య సింధియాకు టెలీ కమ్యూనికేషన్ల శాఖ కేటాయించారు. కింజారపు రామ్మోహన్ నాయుడు.. ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ నేత. 2024లో కేంద్రంలో బీజేపీ తిరిగి అధికారంలోకి రావడంలో బీజేపీ కీలక పాత్ర పోషించింది. శ్రీకాకుళం నుంచి మూడోసారి లోక్ సభకు ఎన్నికైన రామ్మోహన్ నాయుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నారు. ఆయన తండ్రి ఎర్రన్నాయుడు తొలుత టెక్కలి నుంచి శాసనసభకు ఎన్నికవ్వగా, తదుపరి 1996 నుంచి 2004 మధ్య నాలుగు సార్లు శ్రీకాకుళం ఎంపీగా గెలిచారు. కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ హయాంలో ఎర్రన్నాయుడు గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిగా పని చేశారు.
కరీంనగర్ నుంచి రెండోసారి పార్లమెంటుకు ఎన్నికైన బండి సంజయ్ కుమార్‌ను ప్రధాని నరేంద్రమోదీ హోంశాఖ సహాయ మంత్రిగా నియమించారు. చిన్నప్పటి నుంచి ఆరెస్సెస్ కార్యకర్తగా పని చేస్తూ వచ్చిన బండి సంజయ్.. రెండు సార్లు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ గా గెలిచారు. 2014 , 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనా 2019, 2024 లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించారు. అంతకుముందు 1994, 1999ల్లో కరీంనగర్ అర్బన్ సహకార బ్యాంకు డైరెక్టర్ గానూ గెలుపొందారు.
గుంటూరు నుంచి తొలిసారి ఎంపీగా ఎన్నికైన టీడీపీ నేత పెమ్మసాని చంద్రశేఖర్ ను ప్రధాని నరేంద్ర మోదీ గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖల సహాయ మంత్రిగా నియమించారు. పెమ్మసాని చంద్రశేఖర్ వృత్తిరీత్యా వైద్యులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంసెట్ లో 27వ ర్యాంకుతో ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ విద్యనభ్యసించిన పెమ్మసాని.. పీజీ కోసం అమెరికాకు వెళ్లారు. గుంటూరు జిల్లా నుంచి సాధారణ వైద్యుడిగా వెళ్లిన పెమ్మసాని.. అమెరికాలో అనతి కాలంలోనే అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన తండ్రి పెమ్మసాని సాంబశివరావు టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలోనే కొనసాగారు.
నర్సాపురం నుంచి తొలిసారి పార్లమెంట్ కు ఎన్నికైన భూపతి రాజు శ్రీనివాస వర్మను ప్రధాని నరేంద్రమోదీ భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖల సహాయ మంత్రిగా నియమించారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో పని చేసిన శ్రీనివాస వర్మ.. విశాఖలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎంఏ చేశారు. 2014లో తొలిసారి భీమవరం మున్సిపాలిటీ కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. 2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన మద్దతుతో నర్సాపురం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.