Mallikarjun Kharge | బెంగళూరు, సెప్టెంబర్ 2: కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నడుస్తున్న ‘సిద్ధార్థ విహార ట్రస్ట్’ భూ కేటాయింపుల వ్యవహారం కర్ణాటకలో వివాదాస్పదంగా మారింది. బెంగళూరులోని హైటెక్ డిఫెన్స్ ఏరోస్పేస్ పార్క్‌లో ఐదు ఎకరాల ప్రభుత్వ భూమి ట్రస్ట్‌కు కేటాయించిన కాంగ్రెస్ సర్కార్, కలబురిగిలో మరో 19 ఎకరాల ప్రభుత్వ భూమిని ట్రస్ట్‌కు ధారాదత్తం చేసిన సంగతి తాజాగా బయటకొచ్చింది. ఇందుకు సంబంధించి ఆ రాష్ట్ర బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. కలబురిగిలో ట్రస్ట్‌కు చెందిన ‘పాలి, సంస్కృత, కంపారిటీవ్ ఫిలాసఫీ ఇనిస్టిట్యూట్’కు 19 ఎకరాల ప్రభుత్వ భూమిని ఉచితంగా కేటాయించారని బీజేపీ ఎంపీ లహర్ సింగ్ సిరోయ ఆరోపించారు. ‘పాలి ఇన్స్టిట్యూట్కు 2014లో 16 ఎకరాలు కేటాయించారు. కొన్నాళ్ల తర్వాత మరో 3 ఎకరాలు ఇచ్చారు. మొత్తం 19 ఎకరాలను 2017 మార్చిలో ట్రస్ట్ పేరిట ఉచితంగా బదిలీ చేశారు’ అని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఈ భూ కేటాయింపుపై స్వతంత దర్యాప్తు చేపట్టాలని లహర్ సింగ్ డిమాండ్ చేశారు.
ఖర్గే కుటుంబ సభ్యుల ట్రస్ట్‌కు భూ కేటాయింపుల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ స్పందించారు. అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై తనకు నివేదిక సమర్పించాలని రాష్ట్ర సీఎస్ శాలిని రజనీష్‌ని గవర్నర్ సోమవారం ఆదేశించారు.