తిరువనంతపురం : కేరళలో ప్రాణాంతకమైన బ్రెయిన్ ఈటింగ్ అమీబా సోకి మరో వ్యక్తి మృతి చెందాడు. మలప్పురానికు చెందిన 56 ఏండ్ల శోభన్ అనే వ్యక్తి కోజికోడ్ మెడికల్ కాలేజీ దవాఖానలో చికిత్స పొందుతూ సోమవారం మరణించినట్టు అధికారులు ప్రకటించారు. ఈ వ్యాధి సోకి ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది కోజికోడ్ మెడికల్ కాలేజీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
మెదడును తినేసే ‘నెగ్లేరియా ఫాలెరీ’ అనే అమీబా కారణంగా ‘ప్రైమరీ అమీబిక్ మెనింజోఎన్సైఫలిటిస్’ అనే వ్యాధి వారికి సోకిందని వైద్యులు గుర్తించారు. ‘నెగ్లేరియా ఫాలెరీ’ అనే అమీబా నీటి ద్వారా సోకుతుంది. అది ముక్కు రంధ్రాల ద్వారా మెదడుకు పాకి మెదడు కణజాలాన్ని దెబ్బతీస్తుంది.