Breast Cancer | ఎర్నాకులం, డిసెంబర్ 5 : రొమ్ము క్యాన్సర్ బాధితుల్లో పూర్తి స్థాయిలో కణతులను తొలగించేందుకు కేరళకు చెందిన వైద్యులు సరికొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు. క్యాన్సర్ బాధితుల్లో కీమోథెరపి చేసిన తర్వాత కొన్ని కణతులు మిగిలిపోతాయి. వీటిని గుర్తించి, తొలగించడం ఖరీదైన వ్యవహారం. ఇందుకు ఉపయోగించే వైర్లు, క్లిప్‌ల ధర ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారంగా ‘క్లిప్ అండ్ బ్లూ ప్లేస్మెంట్’ అనే కొత్త విధానాన్ని కేరళలోని ఆలువాలో ఉన్న రాజగిరి హాస్పిటల్‌కు చెందిన వైద్య బృందం అభివృద్ధి చేసింది.
‘ఈ ప్రక్రియలో భాగంగా కీమోథెరపీకి ముందే మూడు, నాలుగు సర్జికల్ క్లిప్స్‌ను క్యాన్సర్ కణతుల్లోకి పంపిస్తాం. కీమోథెరపీ తర్వాత అల్ట్రాసౌండ్ ద్వారా ఈ క్లిప్‌లను గుర్తించి, దాంట్లోకి మిథిలీన్ బ్లూ డై పంపిస్తాం. దీంతో కీమోథెరపీ తర్వాత మిగిలిన కణతులను సులభంగా గుర్తించొచ్చు’ అని రాజగిరి హాస్పిటల్ ఆంకాలజీ సర్జన్ డాక్టర్ ఆనంద్ ఎబిన్ వివరించారు. ఈ కొత్త విధానం ద్వారా చికిత్స ఖర్చు రూ.30 వేల నుంచి రూ.2 వేలకు తగ్గుతుందని ఆయన తెలిపారు. ‘క్లిప్ అండ్ బ్లూ ప్లేస్మెంట్’ విధానాన్ని అమెరికన్ సొసైటీ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీ సైతం గుర్తించింది.