Arvind Kejriwal | కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆదేశాల మేరకు పోలీసులు తమ కారుపై దాడి చేయడానికి విపక్షాల కార్యకర్తలను పోలీసులు అనుమతిస్తున్నారని ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీ పోలీసులను కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తన వ్యక్తిగత సైన్యంగా మార్చేశారన్నారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలపై బీజేపీ స్పందించలేదు.
అయితే, పోలీసు అధికారులు మాత్రం కేజ్రీవాల్ ఎన్నికల సభలో ఆయన భద్రత కోసం పోలీసులను నియమించామని చెప్పారు. సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో చేసిన పోస్టుపై దర్యాప్తు చేస్తామని పేరు చెప్పడానికి ఇష్ట పడని ఓ అధికారి చెప్పారు.
హరినగర్, రాజౌరీ గార్డెన్, మాదిపుర్ ప్రాంతాల్లో గురువారం అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హరినగర్‌లో బహిరంగ సభ తర్వాత ‘ఎక్స్’ ఖాతాలో ‘కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆదేశాల మేరకు హరినగర్ బహిరంగ సభలో తన కారుపై దాడి చేసేందుకు పోలీసులు విపక్ష కార్యకర్తలను అనుమతించారు’ అని కేజ్రీవాల్ పోస్ట్ చేశారు.
‘కేంద్ర ఎన్నికల సంఘంపై, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ జాతీయ అధ్యక్షుడిపై పెద్ద సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ పార్టీ నేతలు తరుచుగా దాడి చేస్తున్నా ఎన్నికల సంఘం స్పష్టమైన చర్యలు తీసుకోలేక పోతోంది’ అని కేజ్రీవాల్ అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కేజ్రీవాల్‌కు భద్రత కల్పిస్తూ ఏర్పాటు చేసిన పోలీసులను పంజాబ్ డీజీపీ ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.