తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి రేసులో కేసీ వేణుగోపాల్ ముందంజలో ఉన్నారు. పార్టీ పరిశీలకులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్లు తమ రిపోర్టును పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు సమర్పించిన దరిమిలా ఈ విషయం వెల్లడయ్యింది. ఈ సందర్బంగా అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్ మాట్లాడుతూ సీఎం ఎంపిక అనేది నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, కూటమిలోని నేతలు, ప్రజాభిప్రాయం మొదలైన వాటిపై ఆధారపడి ఉంటుందన్నారు.
పార్టీ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం అతి త్వరలోనే కాంగ్రెస్ అధిష్టానం సీఎం పేరును వెల్లడించనుంది. కాగా వేణుగోపాల్ కేరళ సీఎం రేసులో ముందున్నారు. ఈ జాబితాలో అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వీడీ సతీశన్, మరో సీనియర్ నేత రమేశ్ చెన్నితల ఉన్నారు. కాగా 63 ఏండ్ల వేణుగోపాల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి.
అలప్పుజ ఎంపీ. ఒకవేళ వేణుగోపాల్ ముఖ్యమంత్రి పదవికి ఎన్నికైతే, తన ఎంపీ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. కాగా వచ్చే సోమవారం (మే 11) న కేరళ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం జరిగే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, హాజరయ్యే అవకాశాలున్నాయి.