బెంగళూరు : దేవుడిని, మతాన్ని విశ్వసించని నాస్తికుల సంఖ్యను అధికారికంగా లెక్కించడానికి కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. కుల, మత డాటాతో పాటు ఈ వివరాలు కూడా సేకరించనుంది. ఈనెల 22 నుంచి ప్రారంభం కానున్న కుల గణనలో ఈ నాస్తికత్వం అంశాన్ని కొత్త క్యాటగిరీలో చేర్చింది. రాష్ట్రంలో నాస్తికుల సంఖ్య ఎంత ఉన్నది కచ్చితమైన వివరాలు సేకరించడానికే దీనిని చేపట్టనున్నట్టు ఒక అధికారి తెలిపారు. సాధారణంగా ప్రభుత్వాలు జనాభా లెక్కల సేకరణలో కులం, మతం లాంటి అంశాలకే పరిమితమవుతారు.
అయితే ఇందులో కొత్త క్యాటగిరీని చేర్చారు. ఇది వ్యక్తుల మతపరమైన గుర్తింపును దాటి వారి సైద్ధాంతిక వైఖరిని కూడా నమోదు చేసుకోవడానికి అనుమతినిస్తుంది. రూ.425 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ కుల గణన అక్టోబర్ 7నాటికి పూర్తవుతుంది. కాగా, కొత్తగా చేపట్టే కుల గణనలో నాస్తికత్వం అంశాన్ని కూడా చేర్చడంపై ఇప్పటికే సామాజిక మాధ్యమంలో చర్చ ప్రారంభమైంది. ఇది వ్యక్తిగత స్వేచ్ఛ, నమ్మకాలను గౌరవించే ప్రగతిశీల చర్యగా కొందరు పేర్కొంటుండగా, మతపరంగా సున్నితమైన సమాజంలో గందగోళం, అనుమానాలు సృష్టిస్తుందని, లేనిపోని విద్వేషాలకు దారితీస్తుందని మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.