బెంగళూరు, ఏప్రిల్ 8: చీర కట్టారు.. కాటుక పెట్టారు.. మెట్టెలు, గాజులు ధరించారు.. తల నిండా చీరను కప్పుకుని అచ్చమైన భారత నారిలా ప్రవర్తించారు. కర్ణాటకలో ఉపాధి హామీ పథకం కూలి కోసం కొందరు మగ కూలీలు ఇలా మహిళలుగా నాటకమాడి రూ.3 లక్షలకు పైగా మొత్తాన్ని కాజేశారు. యాద్గిర్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) కింద గ్రామీణ ప్రాంతాలకు కేంద్రం ఉపాధి కల్పిస్తున్నది.
ఈ పథకం ద్వారా అక్రమంగా లబ్ధి పొందేందుకు కొంతమంది పురుషులు చీరలు ధరించి, బొట్టు, కాటుక పెట్టుకుని మహిళల్లా ఫొటోలు తీసుకుని పంపడంతో వారికి ఆమోదం కూడా వచ్చింది. దీంతో వీరు మహిళల్లా నటిస్తూ రూ.3 లక్షలు ప్రభుత్వం నుంచి పొందారు. ఈ పని వల్ల నిజమైన మహిళా కూలీలకు ఉపాధి లేకుండా పోయింది. దీనిపై ఎవరో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో వారి బండారం బయటపడింది. దీంతో ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని అరెస్ట్ చేశారు.