Yediyurappa | మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత బీఎస్ యడ్యూరప్పకు కర్ణాటక హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మైనర్‌పై లైంగిక వేధింపుల కేసులో ఆయనపై నమోదైన పోక్సో కేసును కొట్టివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. కేసును ట్రయల్ కోర్టుకు అప్పగించింది. అయితే, ఆయనకు స్వల్ప ఉపశమనం కల్పించింది. ముందస్తు బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది. యడ్యూరప్పను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్‌ను ఇచ్చింది. ఈ కేసులో ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తు ఎం నాగప్రసన్న ఈ మేరకు తీర్పును వెలువరించారు. మాజీ ముఖ్యమంత్రిపై పోక్సో చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదైన విషయం తెలిసిందే.
17 ఏళ్ల బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గతేడాది మార్చి 14న యడ్యూరప్పపై కేసు నమోదైంది. ఫిబ్రవరి 2న డాలర్స్ కాలనీలోని తన నివాసంలో యడ్యూరప్ప తన కూతురుపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆ మహిళ ఆరోపించింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోక్సో చట్టంలో సెక్షన్ 8, ఐపీసీ సెక్షన్ 354 (ఎ) కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. కేసు విచారణ సందర్భంగా యడ్యూరప్పపై వచ్చిన ఆరోపణలను ఆయన తరఫు న్యాయవాది తోసిపుచ్చారు. తల్లి, కుమార్తె గతంలో ఓ పాత కేసుకు సంబంధించి మాజీ సీఎంను సంప్రదించారని.. అందులోని మరో వ్యక్తి బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా వాదించారు.
అయితే, ప్రభుత్వం ఈ వాదనలను తోసిపుచ్చింది. యడ్యూరప్పపై తగిన ఆధారాలు ఉన్నాయని తెలిపింది. మైనర్‌పై లైంగిక దాడి వేధింపులు హేయమని.. కేసును విచారించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. హైకోర్టు కాగ్నిజెన్స్ ఆర్డర్‌ను రద్దు చేస్తూ యడ్యూరప్పకు ఉపశమనం కల్పించింది. కేసు దర్యాప్తు కొనసాగుతుందని.. ట్రయల్ కోర్టు చర్యలు తీసుకుంటుందని హైకోర్టు పేర్కొంది. యడ్యూరప్ప తరఫున సీనియర్ న్యాయవాది సీవీ నగేశ్, బాధిత కుటుంబం తరఫున ప్రత్యేక న్యాయవాది ప్రొఫెసర్ రవివర్మ కుమార్, న్యాయవాది ఎస్ బాలన్ హాజరయ్యారు.