బెంగళూరు: కరోనా మహమ్మారి ఏ గడియలో భారత్‌లో అడుగుపెట్టిందోగానీ దేశంలో విద్యావ్యవస్థను ఛిన్నాభిన్నం చేసింది. ఆ మహమ్మారి పుణ్యమా అని గత ఏడాది కాలంగా దేశంలో ఎక్కడా ఆఫ్‌లైన్ తరగతులు జరుగలేదు. ఆన్లైన్ క్లాసులు చెబుతున్నా విద్యార్థులను ఇంటర్నెట్ సమస్య వెంటాడుతున్నది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను ఈ సమస్య తీవ్రంగా వేధిస్తున్నది. ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం విద్యార్థులు చెట్ల పొంటి, పుట్టల పొంటి, గుట్టల పొంటి తిరుగాల్సిన పరిస్థితి నెలకొన్నది.
ఈ నేపథ్యంలో కర్ణాటకు చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఇంటర్నెట్ సమస్యకు చక్కని పరిష్కారం కనిపెట్టారు. నెట్ కనెక్టివిటీ పుష్కలంగా ఉన్న ఓ చెట్టుపై ఏకంగా ఇంటిని నిర్మించుకుని విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలు చెబుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లాలోని సోమవార్‌పేట మండలం ముల్లూర్ గ్రామానికి చెందిన సీఎస్ సతీష (37) వృత్తిరీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయుడు. స్థానికంగా ఓ ప్రాథమిక పాఠశాలలో ఆయన టీచర్‌గా పనిచేస్తున్నారు.
ప్రభుత్వ ఉపాధ్యాయుడి వినూత్న ఆలోచన
అయితే, కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం ఆఫ్‌లైన్ బోధన సాధ్యం కాకపోవడంతో ఆన్లైన్లో తరగతులు నిర్వహిస్తున్నారు. కానీ అరకొర ఇంటర్నెట్ సౌకర్యం సతీషను చికాకుపెట్టేది. ఇంటర్నెట్ స్పీడ్ చాలా తక్కువగా ఉండటంతో సతీషకు, ఆయన విద్యార్థులకు సమయం చాలా వృథా అయ్యేది. దాంతో సమస్య పరిష్కారం కోసం బాగా ఆలోచించిన టీచర్ సతీషకు ఒక వినూత్న ఆలోచన తట్టింది. నెట్ కనెక్టివిటీ ఫుల్‌గా ఉన్న ఓ చెట్టుపైనే గదిని నిర్మించుకుని విద్యార్థులకు పాఠాలు చెప్పాలని నిర్ణయించాడు.
రూ.10 వేల ఖర్చుతో చెట్టుపై గది నిర్మాణం
అనుకున్నదే తడవుగా అతని ఆలోచనను ఆచరణలో పెట్టాడు. చెట్టుపైన వెదురు బొంగులు, ఎండు గడ్డి, గోనె సంచులు ఉపయోగించి ఇంటిని నిర్మించాడు. ఆ ఇంటి నుంచే ఎలాంటి అంతరాయం లేకుండా ఇంగ్లిష్, మ్యాథ్స్, కన్నడ సబ్జెక్టుల్లో ఆన్లైన్ తరగతులు బోధిస్తున్నారు. కాగా, స్నేహితుల సాయంతో తాను చెట్టుపై గదిని నిర్మించుకున్నానని, అందుకోసం తనకు రూ.10 వేలు ఖర్చయ్యిందని టీచర్ సతీష చెప్పారు. ఇప్పుడు ఇంటర్నెట్కు సంబంధించి ఎలాంటి అవాంతరాలు లేకుండా బోధన చేయగలుగుతున్నానన్నారు.
అట్టా-పల్లి నుంచే ఈ అద్భుత ఆలోచన
గ్రామంలో రైతులు పంటలను కాపాడుకోవడం కోసం ఏర్పాటు చేసుకునే అట్టా-పల్లిల (మంచెల) ఆధారంగా తనకు ఈ వినూత్న ఆలోచన వచ్చిందని సతీష తెలిపారు. కాగా, టీచర్ సతీష వినూత్న ఆలోచనను గ్రామస్తులతోపాటు అంతా మెచ్చుకుంటున్నారు. రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి సురేంద్రన్ కూడా సతీషను అభినందించారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఇంటర్నెట్ సమస్య పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రికి, చీఫ్ సెక్రెటరీకి లేఖలు రాశారు.
ఇవి కూడా చదవండి..
చేపల కోసం వల వేస్తే కొండచిలువ చిక్కింది..!
పేక మేడలా కూలి నదిలో మునిగిన ఇల్లు.. వీడియో