బెంగళూరు, నవంబర్ 7: కర్ణాటకలోని ప్రభుత్వ దవాఖానల్లో డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది కొరత తీవ్రస్థాయిలో ఉందంటూ వెలువడిన వార్త కథనాల్ని ఆ రాష్ట్ర హైకోర్టు సీరియస్‌గా తీసుకుంది. ఈ అంశంపై కర్ణాటక హైకోర్టు స్వయంగా కలుగజేసుకొని పిల్ (ప్రజా ప్రయోజన వ్యాజ్యం) దాఖలు చేయటం గమనార్హం. ప్రభుత్వ దవాఖానలు తీవ్రమైన సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్నాయని, సుమారుగా 16,500 ఖాళీలు ఏర్పడ్డాయని అక్టోబర్ 16న దిన పత్రికల్లో వార్తా కథనాలు వెలువడ్డాయి.
ఈ వార్తా కథనాల్ని పరిగణలోకి తీసుకొని ‘పిల్’ దాఖలు చేయాలంటూ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రసన్న బి.వరాలె, జస్టిస్ క్రిష్ణ ఎస్.దీక్షిత్‌లతో కూడిన ధర్మాసనం హైకోర్టు రిజిస్ట్రార్‌ను మంగళవారం ఆదేశించింది. ఈ అంశంపై హైకోర్టుకు సహకరించేందుకు అడ్వకేట్ శ్రీధర్ ప్రభును అమికస్ క్యూరీగా నియమించింది.