బాగల్కోట్: కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మణ్ సవది సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో అసంతృప్తి ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారని, జనవరి 26 తర్వాత దీనిపై ముందుకు వెళ్తామన్నారు. ‘ఆ తర్వాత ఎంత మంది శాసనసభ్యులు కాంగ్రెస్లో చేరుతారో మీరే చూడండి!’ అని సవది మీడియాను ఉద్దేశించి అన్నారు.
‘ఆపరేషన్ హస్త’పై లక్ష్మణ్ సవది మీడియాతో మాట్లాడుతూ చాలా మంది బీజేపీ నేతలు కాంటాక్టులో ఉన్నారని వ్యాఖ్యానించారు. వారి చేరిక ప్రక్రియ ఒకసారి పూర్తయిన తర్వాత, వారికి తగిన పోస్టులు ఇవ్వడంపై ఆలోచన చేస్తామని అన్నారు. బీజేపీ నుంచి వచ్చే వారెవరికీ అన్యాయం జరుగదని, ఇష్టపూర్వకంగా తమ పార్టీలో చేరేవారికి సాదరంగా స్వాగతం పలుకుతామన్నారు.