Congress MLA | బెంగళూరు, అక్టోబర్ 18: లోక్సభ ఎన్నికల్లో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ డబ్బు పంపిణీ వ్యవహారం బట్టబయలైంది. డబ్బు ఎలా పంచాలో పార్టీ కార్యకర్తలకు అర్సికేరె ఎమ్మెల్యే కేఎం శివలింగగౌడ సూచిస్తున్నట్టుగా ఉన్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ‘సీఎం, డిప్యూటీ సీఎం చెప్పినట్టుగా డబ్బు పంచాలి. శ్రేయస్ పటేల్(హసన్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి) రూ.5 కోట్లు, మాజీ ఎమ్మెల్సీ గోపాలస్వామి కోటి రూపాయలు, నేను కోటి రూపాయలు ఇస్తా. మొత్తం రూ.7 కోట్లు సరిగ్గా పంచాలి.
ఓటుకు రూ.500 చొప్పున ఇవ్వండి. ఇతర పార్టీలకు ఓటు వేస్తారని అనుకునే వారికి డబ్బులు పంచకండి. ఇది సీఎం, డిప్యూటీ సీఎం నిర్ణయం’ అని శివలింగగౌడ పార్టీ నేతలతో మాట్లాడినట్టుగా ఈ ఆడియో ఉంది. ఎన్నికల వేళ లీకైన హసన్ జేడీఎస్ అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోల వ్యవహారంపైనా ఇందులో చర్చ జరిగింది. ‘వాటిని సరిగ్గా వినియోగించుకోవాలి. వీడియో లీక్ అయిన తర్వాత కుమారస్వామి ప్రచారానికి రాలేదు. దేవెగౌడ ఈ వయసులో ప్రచారానికి రాలేరు.’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు.