బెంగళూరు, డిసెంబర్ 22: అలవి కాని గ్యారెంటీలు, హామీలతో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని నెరవేర్చడానికి రాష్ర్టాన్ని అప్పుల కుప్పగా మారుస్తున్నది. తమ పార్టీ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ బాటలో నడుస్తూ ఎడా పెడా అప్పులు చేస్తున్నది. ఈ ఏడాది సెప్టెంబర్, నవంబర్ నెలల్లో కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న అప్పుల్లో 347 శాతం పెరుగుదల కనిపించడమే ఇందుకు నిదర్శనం. రాష్ట్ర ఆర్థిక శాఖ లెక్కల ప్రకారం సెప్టెంబర్లో సిద్ధరామయ్య సర్కారు రూ.7,349 కోట్ల అప్పులు తీసుకుంది. నవంబర్ చివరి నాటికి ఈ అప్పులు రూ.32,884 కోట్లకు పెరిగాయి. అంటే రెండు నెలల్లోనే ప్రభుత్వం రూ.25,535 కోట్ల రుణాలను తీసుకుంది. ఆరు గ్యారెంటీల అమలు ఒత్తిడి పెరగడంతో ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మరిన్ని అప్పుల కోసం వెంపర్లాడనుంది. గ్యారెంటీల అమలు కోసం ప్రభుత్వానికి ప్రతి నెల రూ.4,334 కోట్లు అవసరం అవుతున్నాయి.
ప్రస్తుత 2024-25 ఆర్థిక సంవత్సరంలో కాంగ్రెస్ సర్కార్ రూ.1.05 లక్షల కోట్లు అప్పు తీసుకొనే అవకాశం ఉన్నట్టు సమాచారం. గత ఆర్థిక సంవత్సరంలో రూ.90,280 కోట్ల అప్పులు తెచ్చిన ప్రభుత్వం వాటిని కేవలం ఆరు గ్యారెంటీల అమలుకు, పాత రుణాల చెల్లింపు, వడ్డీకి మాత్రమే ఖర్చు పెట్టింది. దీంతో అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన పథకాలను నిధుల కొరత వేధిస్తున్నది. తీసుకున్న అప్పులకు సిద్ధూ సర్కార్ భారీగా వడ్డీలు చెల్లించాల్సి వస్తోందని ఆర్థిక శాఖ వాపోయింది. ఈ ఏడాది ఏప్రిల్-నవంబర్ మధ్యలో ప్రభుత్వం తాను తీసుకున్న రుణాలకు అసలు, వడ్డీ కింద రూ.33,831 కోట్లు చెల్లించింది. అంటే సగటున ఒక నెలకు రూ.4,141 కోట్లను అప్పులను చెల్లించడానికి ప్రభుత్వం వినియోగిస్తున్నది.
ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ప్రభుత్వ రుణాలు రూ.6.65 లక్షల కోట్లకు చేరే ప్రమాదం ఉందని ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ చేసిన మొత్తం అప్పులు రాష్ట్ర జీఎస్డీపీలో 23.24 శాతానికి చేరుకోవడం ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. పరిస్థితి ఇలా ఉంటే ఆరు గ్యారెంటీల లబ్ధిదారుల సంఖ్యలో తేడాలు ఉండటం వల్ల వాటికి అవసరమైన బడ్జెట్ను ప్రభుత్వం అంచనా వేయలేకపోతున్నదని అసెంబ్లీ సాక్షిగా సిద్ధరామయ్య పేర్కొన్నారు.
కర్ణాటకలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఇక్కడ కూడా అమలు చేస్తామని ప్రజలకు ఆశలు చూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటి అమలు కోసం కిందా మీద పడుతున్నది. గ్యారెంటీల్లో చాలా పథకాలను అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఇంకా ప్రారంభించలేదు. మరోవైపు అరకొరగా అమలు చేస్తున్న కొద్దిపాటి సంక్షేమ పథకాలను అప్పుల డబ్బులతోనే కాంగ్రెస్ ప్రభుత్వం నెట్టుకొస్తున్నది. ఇందుకోసం ఒక్క ఏడాదిలోనే రూ.1.27 లక్షల కోట్లు అప్పు తెచ్చామని స్వయంగా ముఖ్యమంత్రే ప్రకటించారు. ఈ నేపథ్యంలో కొత్త పథకాలైనా, పాత పథకాలైనా, గ్యారెంటీలైనా అమలు చేయడానికి భారీగా అప్పులు చేయాల్సి వస్తుందని.. అదే పరిస్థితి వస్తే రేవంత్ రెడ్డి సర్కార్ కూడా అప్పుల ఊబిలో కూరుకుపోతుందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.