Karnataka CM : కర్నాటక గవర్నర్ను కాంగ్రెస్ నేతలు అవమానిస్తున్నారని కాషాయ నేతలు చేస్తున్న విమర్శలపై కర్నాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. గవర్నర్ను తాము ప్రశ్నిస్తే అవమానించినట్టా అని నిలదీశారు. శశికళా జొల్లె, మాజీ మంత్రి మురుగేష్ నిరాని, జనార్ధన రెడ్డిపై ఫిర్యాదులున్నాయని సీఎం తెలిపారు. వీరిని ప్రాసిక్యూట్ చేసేందుకు తాము గవర్నర్ను కోరినా పర్మిషన్ ఇవ్వలేదని వివరించారు.
గవర్నర్ పదవి అనేది రాజ్యాంగబద్ధమైనదని, రాష్ట్రపతి ప్రతినిధిగా ఆయన పనిచేయాలని, కేంద్రం ప్రతినిధిగా వ్యవహరించరాదని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. కాగా ముడా స్కామ్లో కర్నాటక సీఎం సిద్ధరామయ్య ప్రాసిక్యూషన్కు రాష్ట్ర గవర్నర్ అనుమతించడం కర్నాటక రాజకీయాలను కుదిపేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ముడా స్కామ్లో కర్నాటక సీఎం సిద్ధరామయ్యపై బీజేపీ చేస్తున్న ఆరోపణలు సత్యదూరమని కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా తోసిపుచ్చారు.
రాజకీయ దురుద్దేశంతోనే సిద్ధరామయ్యపై కాషాయ పార్టీ అవినీతి ఆరోపణలు గుప్పిస్తోందని దుయ్యబట్టారు. బీజేపీ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలు లేవని అన్నారు. హిమాచల్ ప్రదేశ్లో ఎన్నికైన తమ ప్రభుత్వాన్ని అస్ధిరపరిచేందుకు కాషాయ నేతలు ప్రయత్నించారని, మహారాష్ట్ర, జార్ఖండ్లో కూడా అదే జరిగిందని ఆరోపించారు. కాషాయ నేతలు ఇప్పుడు కర్నాటకలో సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ను కూలదోసేందుకు కుటిల యత్నాలు చేస్తున్నారని, వారి ప్రయత్నాలు ఫలించబోవని పవన్ ఖేరా స్పష్టం చేశారు.
Read More :
Rain | గద్వాల జిల్లాలో భారీ వర్షం.. అయిజ నుంచి ఏపీకి నిలిచిన రాకపోకలు