హైదరాబాద్: హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో భారీ వర్షం (Rain) కురుస్తున్నది. జోగులాంబ గద్వాల, నాగర్కర్న్ల్ జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. జోగులాంబ జిల్లాలో సోమవారం రాత్రి నుంచి ఆగకుండా వర్షం పడుతున్నది. గద్వాల, మల్దకల్, కేటిదొడ్డి, గట్టు, ధరూర్, అయిజ మండలాల్లో భారీగా వాన వస్తున్నది. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అయిజ నుంచి కర్నూల్ మార్గంలో ఉన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. అంతర్రాష్ట్ర రహదారికావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వరద ప్రవాహానికి బ్రిడ్జి దెబ్బతిన్నది. నాగర్‌కర్నూల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులు జలమయమయ్యాయి.
ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. అత్యధికంగా యాదగిరిగుట్టలో 93.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మోటకొండూరులో 88.8 మి.మీ., నారాయణపురం మండలంలోని జనగాంలో 68 మి.మీ చొప్పున వర్షం కురిసింది. హైదరాబాద్ వ్యాప్తంగా కుండపోతగా వర్షం కురిసిన విషయం తెలిసిందే. చాలాచోట్ల 10 సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోయింది. అత్యధికంగా యూసుఫ్‌గూడలో 11 సెం.మీ. వర్షం పడింది. ఇక మరో ఉదయం 10.30 గంటల వరకు హైదరాబాద్‌లో వర్షం కురిసే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ తెలిపింది.
కాగా, తెలంగాణ అంతటా మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరించింది. జనగామ, గద్వాల, మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ, నాగర్‌కర్నూల్, నారాయణపేట, సిద్దిపేట, వనపర్తి జిల్లాల్లో వానలు పడతాయని తెలిపింది. రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, భువనగిరిలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది.