Karnataka | కన్నడ నాట ముఖ్యమంత్రి మార్పు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో ఈ అంశం రాజకీయ గందరగోళానికి దారి తీస్తున్నది. నిన్నటి వరకు తానే ఐదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతానని చెప్పిన సిద్ధరామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని వెల్లడించారు. హైకమాండ్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందని ప్రశ్నించగా.. సిద్ధరామయ్య త్వరలోనే నిర్ణయం తీసుకుంటారన్నారు. సిద్ధరామయ్య బెంగళూరులోని నివాసంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కలిశారు. సమావేశం అనంతరం సిద్ధరామయ్య మాట్లాడుతూ పార్టీ, స్థానిక సంస్థల ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలపై చర్చించినట్లు తెలిపారు.
మంత్రివర్గంపై ఎలాంటి చర్చ జరుగలేదన్నారు. నాయకత్వ మార్పు కేవలం ఊహాగానాలు మాత్రమేనని.. ఇదంతా మీడియా సృష్టేనన్నారు. హైకమాండ్ ఏం చెప్పినా అందరూ దాన్ని అంగీకరించాలన్నారు. అది నేను అయినా.. డీకే శివకుమార్ అయినా అంగీకరించాల్సిందేనన్నారు. శుక్రవారం సిద్ధరామయ్య నాయకత్వ మార్పు, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై నిర్ణయం పార్టీ అగ్ర నాయకత్వంపై ఆధారపడి ఉంటుందని వ్యాఖ్యానించారు. దీనిపై అగ్రనాయకత్వం ఏదైనా చెప్పిందా? అని ప్రశ్నించగా.. ‘మనం ఏమీ చేయలేం. కొంతమంది దీని గురించి ముందే చర్చించుకునేవారు. ఇప్పుడు వారు (ఢిల్లీకి) వెళ్లి ఉండవచ్చు. చివరికి.. నేను, శివకుమార్ హైకమాండ్ చెప్పేది వినాలి, అంగీకరించాలి. తర్వాతి రెండు బడ్జెట్లను మీరే ప్రవేశపెడుతారా? అని ప్రశ్నించగా.. దీన్ని మీరెందుకు అడుగుతున్నారు? అవును నేనే కొనసాగిస్తా. తదుపరి బడ్జెట్‌ను నేను ప్రవేశపెడతా?’నన్నారు. సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యలపై డీకే స్పందిస్తూ.. సీఎం సిద్ధరామయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. అందరం కలిసి పని చేస్తామన్నారు.
రాష్ట్రంలో 140 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు తాను నాయకుడినని.. తాను వర్గపోరును నమ్మనన్నారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్‌లో చీలికల నేపథ్యంలో కర్నాటక ఇన్చార్జిగా ఉన్న ఏఐసీసీ జనరల్ సెక్రటరీ రణ్‌దీప్ సుర్జేవాలా నాయకత్వ మార్పు అంశంపై ఎవరూ బహిరంగ ప్రకటనలు చేయొద్దని పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులను హెచ్చరించారు. కనీసం 15 మంది ఎమ్మెల్యేలు, దాదాపు డజను మంది శాసనమండలి సభ్యులు ఢిల్లీలో మకాం వేసి, డీకే శివకుమార్‌ను ముఖ్యమంత్రిని చేయాలని పార్టీ నాయకత్వంపై ఒత్తిడి తెస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. నివేదికల ప్రకారం.. 2023 ఒప్పందం ప్రకారం సిద్ధరామయ్య, శివకుమార్ ఇద్దరూ రెండున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రులుగా పనిచేయడానికి అంగీకరించారని.. ఈ క్రమంలో డీకే వర్గీయులు నాయకత్వ మార్పు కోసం డిమాండ్ చేస్తున్నారు.