Siddaramaiah | బెంగళూరు, ఆగస్టు 17 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ముడా కుంభకోణంలో విచారణను ఎదుర్కోనుండటం ఒకవైపు, వాల్మీకి కార్పొరేషన్ స్కామ్‌లో ఈడీ అరెస్టులు మరోవైపు, రాష్ట్ర వక్ఫ్‌బోర్డులో అవినీతి మరకలు ఇంకోవైపు.. వెరసి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పదవికే ముప్పు తెస్తున్నాయి. వీటితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆయన మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పటికీ సీఎం పదవి నుంచి దిగిపోవడానికి సిద్ధమైనట్టు సమాచారం.
ఇదే విషయమై అధిష్ఠానం బుజ్జగింపులకు ప్రయత్నించినా.. ఆయన తిరస్కరిస్తున్నట్టు తెలుస్తున్నది. 76 ఏండ్ల వయసులో ఈ రాజకీయ ఒత్తిళ్లు, విచారణలు అవసరమా? అని సన్నిహితుల వద్ద సిద్ధరామయ్య వాపోయినట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో త్వరలోనే ఆయన సీఎం పదవికి రాజీనామా చేయవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
నిరుడు కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డీకే శివకుమార్ సీఎం అవుతారని అందరూ భావించారు. అయితే, అనూహ్యంగా అధిష్ఠానం సిద్ధరామయ్యకు ఆ పదవిని కట్టబెట్టింది. అయితే, తమ నాయకుడికి సీఎం పదవిని ఇవ్వకపోవడంపై డీకే వర్గం ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు. అయితే, మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు సిద్ధరామయ్యకు ఉండటంతో ఇంతకాలం ముఖ్యమంత్రి మార్పు జరుగలేదు. ఇదే సమయంలో డీకేకు ఉప ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠానం కేటాయించింది.
కాగా, సిద్ధరామయ్య సీఎం పదవి నుంచి దిగిపోతే ఎవరు ఆ రేసులో ఉంటారన్న చర్చ ప్రస్తుతం జరుగుతున్నది. హోంమంత్రి జీ పరమేశ్వరకు సీఎం పదవి ఇవ్వొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డీకేపై అప్పట్లో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో అధిష్ఠానం పరమేశ్వర వైపు మొగ్గు చూపవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.